DK Shivakumar: విధానసభ వద్ద సైకిల్ దిగుతూ జారిపడిన కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్

DK Shivakumar Falls Off Cycle Near Karnataka Assembly
  • పర్యావరణ దినోత్సవం-2025 నాడు బెంగళూరులో ఎకో-వాక్
  • కార్యక్రమానికి సైకిల్‌పై హాజరైన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్
  • విధానసౌధ వద్ద సైకిల్ దిగుతూ అదుపుతప్పి పడిపోయిన డీకే
  • వెంటనే స్పందించి పైకి లేపిన భద్రతా సిబ్బంది
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ మంగళవారం నాడు బెంగళూరులోని విధాన సౌధ సమీపంలో సైకిల్ తొక్కుతూ అదుపుతప్పి కిందపడిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు సరదా వ్యాఖ్యలతో పాటు, ఆయన ధరించిన ఖరీదైన శాలువాపైనా, నగరాల్లో మౌలిక వసతులపైనా భిన్న రీతుల్లో స్పందిస్తున్నారు.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం-2025ను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఎకో-వాక్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన సైకిల్‌పై విధానసౌధకు చేరుకున్నారు. అయితే, సైకిల్ దిగే క్రమంలో ఆయన అదుపుతప్పి కింద పడిపోయారు. గమనించిన భద్రతా సిబ్బంది, సమీపంలోని వారు వెంటనే పరుగెత్తుకొచ్చి ఆయనను పైకి లేపారు. ఈ ఘటన మొత్తం కెమెరాలో రికార్డయింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.

కాగా, ఈ ఘటనకు కొద్దిసేపటి ముందు డీకే శివకుమార్ తానూ విధాన సౌధకు సైకిల్‌పై వెళుతున్న ఫోటోను 'ఎక్స్' ఖాతాలో పోస్ట్ చేశారు. "విధాన సభకు వెళ్లడానికి నేను సైకిల్‌ను ఎంచుకున్నాను, ఎందుకంటే ప్రగతికి ఎప్పుడూ హార్స్‌పవర్ అవసరం లేదు, ప్రజా బలమే ముఖ్యం" అంటూ దానికి ఒక సందేశాన్ని కూడా జతచేశారు. బెంగళూరు వీధుల్లో సైకిల్ తొక్కుతున్న సమయంలో డీకే శివకుమార్ మెడలో లూయీ విటన్ కంపెనీకి చెందిన ఖరీదైన శాలువా ధరించడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.
DK Shivakumar
Karnataka Deputy CM
Congress
Cycle Accident
Vidhana Soudha
Bengaluru

More Telugu News