Hyderabad Cyber Crime: ఆన్‌లైన్ షాపింగ్ ఆఫర్లు, పబ్లిక్ వైఫై ద్వారా ఆర్థిక లావాదేవీలు: హైదరాబాద్ సైబర్ క్రైమ్ హెచ్చరిక

Hyderabad Cyber Crime Warns on Online Shopping Offers Public Wifi Frauds
  • క్రిప్టో పెట్టుబడులపై భారీ లాభాల ఆశ వద్దు, డబ్బు రెట్టింపు అవుతుందంటే నమ్మొద్దు
  • నకిలీ స్క్రీన్‌షాట్‌లతో వాట్సాప్, టెలిగ్రామ్‌ గ్రూపుల్లో మోసపూరిత పెట్టుబడి పథకాలు
  • తక్కువ ధరలంటూ సోషల్ మీడియా లింకులతో ఫేక్ ఈ-కామర్స్ సైట్ల పట్ల జాగ్రత్త
  • తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు ఆశ చూపే ట్రేడింగ్ టిప్స్‌కు దూరంగా ఉండాలి
  • పబ్లిక్ వైఫైలో ఆర్థిక లావాదేవీలు చేయొద్దు, క్యూఆర్ కోడ్ స్కాన్‌లో అప్రమత్తత అవసరం
మారుతున్న కాలంతో పాటు మోసాలు తీరు కూడా మారుతోంది. ఆన్‌లైన్ వేదికగా సైబర్ నేరగాళ్లు అమాయకులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. క్రిప్టో కరెన్సీ పెట్టుబడులు, ఆన్‌లైన్ షాపింగ్ ఆఫర్లు, సోషల్ మీడియాలో ట్రేడింగ్ టిప్స్ వంటి వివిధ మార్గాల్లో ప్రజలను ఆకర్షించి, వారి డబ్బును దోచుకుంటున్నారు. ఇటువంటి మోసాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు. ఈ మేరకు 'ఎక్స్' వేదికగా వరుస ట్వీట్లు చేశారు.

క్రిప్టో కరెన్సీ మోసాలు

క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే కొద్ది రోజుల్లోనే భారీగా లాభాలు వస్తాయని, పెట్టిన డబ్బు రెట్టింపు అవుతుందని చెప్పే మాటలను అస్సలు నమ్మవద్దని హెచ్చరించారు. మోసగాళ్లు వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో గ్రూపులు సృష్టించి, నకిలీ లావాదేవీల స్క్రీన్‌షాట్‌లను షేర్ చేస్తూ నమ్మించే ప్రయత్నం చేస్తారు. ఇటువంటి వాటిని చూసి ఆశపడి పెట్టుబడులు పెడితే నష్టపోవడం ఖాయమని హెచ్చరిస్తూ 'ఎక్స్' వేదికగా పోస్టు చేశారు.

ఆన్‌లైన్ షాపింగ్ వంచన

మార్కెట్ ధర కంటే చాలా తక్కువ ధరకే వస్తువులు లభిస్తున్నాయని సామాజిక మాధ్యమాల్లో కనిపించే ఆకర్షణీయమైన ప్రకటనలు, లింకులను గుడ్డిగా క్లిక్ చేయవద్దని సూచించారు. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థల వెబ్‌సైట్లను పోలి ఉండేలా నకిలీ వెబ్‌సైట్లను సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారని, అందువల్ల ఆన్‌లైన్‌లో ఏదైనా కొనుగోలు చేసే ముందు వెబ్‌సైట్ అసలైనదో కాదో క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని హితవు పలికారు.

సామాజిక మాధ్యమం ద్వారా పెట్టుబడి సలహాలు

సామాజిక మాధ్యమ వేదికల్లో కనిపించే పెట్టుబడి సలహాలను గుడ్డిగా నమ్మడం ప్రమాదకరమని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే అత్యాశ మిమ్మల్ని చిక్కుల్లో పడేయొచ్చని, ముఖ్యంగా వాట్సాప్, టెలిగ్రామ్‌లలో షేర్ అయ్యే ట్రేడింగ్ టిప్స్, పెట్టుబడి పథకాలకు దూరంగా ఉండటం మంచిదని సూచించారు.

పబ్లిక్ వైఫై వినియోగంలో జాగ్రత్తలు

బహిరంగ ప్రదేశాల్లో లభించే ఉచిత వైఫై నెట్‌వర్క్‌లను వినియోగించేటప్పుడు ఆర్థిక లావాదేవీలు చేయడం సురక్షితం కాదని హెచ్చరించారు. ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఉచిత వైఫై కోసం క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేయాల్సి వస్తే, అది నమ్మకమైన సోర్స్ నుంచి వచ్చిందో లేదో నిర్ధారించుకోవాలని, సైబర్ నేరగాళ్లు నకిలీ వైఫై హాట్‌స్పాట్‌లను ఏర్పాటు చేసి మీ వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని తస్కరించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పబ్లిక్ వైఫై వాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Hyderabad Cyber Crime
Cyber Crime
Online Shopping Offers
Public Wifi
Cyber Frauds

More Telugu News