Revanth Reddy: తెలంగాణలో సమగ్ర గోసంరక్షణకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం

Revanth Reddy Initiates Comprehensive Cow Protection Program in Telangana
  • రాష్ట్రంలో సమగ్ర గోసంరక్షణ విధానం రూపకల్పన
  • వివిధ రాష్ట్రాల పద్ధతుల అధ్యయనానికి త్రిసభ్య కమిటీ
  • నాలుగు ప్రాంతాల్లో అధునాతన గోశాలల నిర్మాణం
  • కోడెల సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచన
  • గోసంరక్షణకు నిధుల కొరత ఉండదని సీఎం భరోసా
రాష్ట్రంలో గోవులను సంరక్షించేందుకు సమగ్రమైన విధానాన్ని రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందు కోసం ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న పద్ధతులను క్షుణ్ణంగా పరిశీలించేందుకు ముగ్గురు కీలక అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. మన సంస్కృతిలో గోవులకు ఉన్న విశిష్ట స్థానాన్ని, భక్తుల మనోభావాలను గౌరవిస్తూ, గోసంరక్షణే ప్రధాన లక్ష్యంగా ఈ పాలసీ ఉండాలని ఆయన స్పష్టం చేశారు.

మంగళవారం తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోసంరక్షణ అంశంపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సరైన వసతి, స్థలం లేకపోవడం వంటి కారణాలతో గోవులు తరచూ మృత్యువాత పడుతుండటం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని నివారించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.

గోసంరక్షణ విధాన రూపకల్పన కోసం పశుసంవర్థకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సవ్యసాచి ఘోష్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావులతో కూడిన కమిటీని నియమించారు. ఈ కమిటీ ఇతర రాష్ట్రాల్లోని గోసంరక్షణ విధానాలను అధ్యయనం చేసి, మన రాష్ట్రానికి అనువైన సూచనలతో నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించారు.

తొలిదశలో భాగంగా రాష్ట్రంలోని నాలుగు కీలక ప్రాంతాల్లో అన్ని హంగులతో కూడిన ఆధునిక గోశాలలను నిర్మించాలని ముఖ్యమంత్రి సూచించారు. వేములవాడ, యాదగిరిగుట్ట, హైదరాబాద్ నగర శివారులోని ఎనికేపల్లి, పశు విశ్వవిద్యాలయం సమీపంలో విశాలమైన ప్రాంగణాల్లో ఈ గోశాలలను ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా వేములవాడ సమీపంలో కనీసం వంద ఎకరాల విస్తీర్ణంలో గోశాల ఉండాలని ఆయన స్పష్టం చేశారు. భక్తులు మొక్కుబడిగా సమర్పించే కోడెలను కూడా ప్రత్యేక శ్రద్ధతో సంరక్షించాలని తెలిపారు. గోసంరక్షణ కోసం ఎంత ఖర్చయినా ప్రభుత్వం వెనుకాడబోదని సీఎం హామీ ఇచ్చారు.
Revanth Reddy
Telangana
Cow Protection
Gosala
Animal Husbandry
Yadagirigutta
Vemulawada
Enikepalli
Goshala

More Telugu News