Chevireddy Bhaskar Reddy: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ కీలక నేత అరెస్టు

Chevireddy Bhaskar Reddy Arrested in AP Liquor Scam Case
  • లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డిని అరెస్టు చేసిన సిట్ అధికారులు
  • బెంగళూరు నుంచి కొలంబోకు వెళ్లే ప్రయత్నంలో ఉండగా అడ్డుకున్న ఎయిర్ పోర్టు పోలీసులు
  • ఎయిర్ పోర్టు అధికారుల సమాచారంతో బెంగళూరు వెళ్లి చెవిరెడ్డిని అదుపులోకి తీసుకున్న వైనం
  • నేటి సాయంత్రం విజయవాడ కోర్టులో హాజరుపర్చనున్న సిట్ అధికారులు
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ బృందం మరో కీలక నేతను అరెస్టు చేసింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న ఆయన తన సన్నిహితుడు వెంకటేశ్ నాయుడుతో కలిసి బెంగళూరు నుండి కొలంబోకు వెళ్లే ప్రయత్నంలో ఉండగా, విమానాశ్రయ పోలీసులు చెవిరెడ్డిని అడ్డుకున్నారు.

చెవిరెడ్డిపై పోలీసులు ఇదివరకే లుక్ అవుట్ నోటీసు జారీ చేసి ఉండటంతో విమానాశ్రయ ఇమిగ్రేషన్ అధికారులు ఆయనను నిలువరించి ఏపీ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఏపీ నుంచి సిట్ బృందం బెంగళూరుకు వెళ్లి నిన్న రాత్రి వారిద్దరినీ అరెస్టు చేసింది. వీరి అరెస్టుతో లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన నిందితుల సంఖ్య తొమ్మిదికి చేరింది. అరెస్టు చేసిన ఇద్దరు నిందితులను ఈరోజు సాయంత్రం విజయవాడ కోర్టులో సిట్ అధికారులు ప్రవేశపెట్టనున్నారు.

కాగా, లిక్కర్ స్కామ్ కేసులో కీలక నిందితుడైన రాజ్ కసిరెడ్డి నుంచి మద్యం ముడుపుల డబ్బు పెద్ద ఎత్తున చెవిరెడ్డి భాస్కరరెడ్డికి చేరిందని, ఆ డబ్బు గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు చేరవేశారని సిట్ అధికారుల విచారణలో గుర్తించారు. ఈ కేసులో చెవిరెడ్డి వద్ద పనిచేసిన గన్ మెన్, అతని అనుచరులను సిట్ అధికారులు ఇటీవల విచారణ చేయడంతో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు బెంగళూరు నుంచి శ్రీలంక వెళ్లే ప్రయత్నం చేశాడని అనుమానిస్తున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో మొదటిసారి వైసీపీకి చెందిన కీలక నేతను, పైగా వైఎస్ జగన్ కు సన్నిహితుడైన వ్యక్తిని అరెస్టు చేయడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 
Chevireddy Bhaskar Reddy
AP Liquor Scam
YS Jagan
YSRCP
Andhra Pradesh
Liquor Case Investigation
Raj Kasireddy
Vijayawada Court
Venkatesh Naidu
Liquor Money Laundering

More Telugu News