Kommineni Srinivasa Rao: నా ప్రతిభ కాదు.. వారి చొరవే నన్ను నిలబెట్టింది: వైఎస్ జగన్‌పై కొమ్మినేని ప్రశంసలు

Kommineni Praises YS Jagan For Support During Difficult Times
  • వైఎస్ జగన్, భారతికి కొమ్మినేని హృదయపూర్వక కృతజ్ఞతలు
  • క్లిష్ట సమయంలో కొండంత అండగా నిలిచారని వెల్లడి
  • తన కోసం పోరాడిన న్యాయవాద బృందానికి ధన్యవాదాలు తెలిపిన యాంకర్
  • తన ప్రతిష్ఠను దెబ్బతీసే కుట్ర జరిగిందని ఆవేదన
  • అబద్ధపు ప్రచారాలు చేయవద్దని మీడియాకు హితవు
ఇటీవల తాను ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితుల్లో తనకు అండగా నిలిచిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన భార్య వైఎస్ భారతీరెడ్డికి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు (కేఎస్ఆర్) హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తాను నిర్దోషిగా బయటపడటానికి వారి చొరవే కారణమని, వారు అందించిన సహకారం వల్లే తాను మళ్లీ ప్రజల ముందుకు రాగలిగానని పేర్కొన్నారు.

తాను ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితుల గురించి, ఆ సమయంలో తనకు అండగా నిలిచిన వారి గురించి కొమ్మినేని శ్రీనివాసరావు తన మనోభావాలను పంచుకున్నారు. తాను మధ్యతరగతికి చెందిన వ్యక్తినని, సుప్రీంకోర్టు వరకు వెళ్లడం తన ప్రతిభ కాదని, కేవలం వారి చొరవ, న్యాయం కోసం వారు చేసిన పోరాటం వల్లే ఇది సాధ్యమైందని కేఎస్ఆర్ స్పష్టం చేశారు. ఈ పోరాటంలో సహకరించిన సుప్రీంకోర్టు, మంగళగిరి కోర్టులోని న్యాయవాద బృందానికి కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు.

తనకు లభించిన ప్రజాదరణ చూసి ఆశ్చర్యపోయానని, భిన్నమైన భావజాలాలున్న వారు సైతం తనను కలిసి ఆవేదన వ్యక్తం చేసిన తీరు మర్చిపోలేనని కొమ్మినేని పేర్కొన్నారు. "నా 50 ఏళ్ల జర్నలిజం కెరీర్‌లో ఎప్పుడూ రాని మచ్చతో జీవితాన్ని చాలించాల్సి వస్తుందేమోనని బాధపడ్డాను. అరెస్టులకు భయపడి కాదు, నా వ్యక్తిత్వం, విశ్వసనీయత దెబ్బతీసేలా కుట్ర జరగడం నన్ను చాలా ఆవేదనకు గురిచేసింది" అని ఆయన విచారం వ్యక్తంచేశారు.

కొందరు తన ఊపిరి తీయాలని చూస్తే జగన్, భారతి తనకు ఊపిరి పోసి పునర్జన్మనిచ్చారని కొమ్మినేని భావోద్వేగంగా అన్నారు. "వారికి నా శతకోటి దండాలు. ఊపిరి తీయడం సులభం, కానీ ఊపిరి పోయడం కష్టం. అలాంటిది వారు నాకు మళ్లీ ఈ అవకాశం కల్పించారు" అని తెలిపారు. తాను జైల్లో ఉన్న సమయంలో కూడా 'కేఎస్ఆర్ లైవ్ షో'ను అదే బ్రాండ్‌తో కొనసాగించడం తన పట్ల వారికి ఉన్న గౌరవాభిమానాలను తెలుపుతోందని, వారికి ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడం లేదని అన్నారు.

కొందరు మిత్రులు, తనతో కలిసి పనిచేసిన సహచరులే తనకు వ్యతిరేకంగా వార్తలు రాయడం, అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం తనను బాధించిందని కేఎస్ఆర్ అన్నారు. "నా గురించి బాగా తెలిసిన వారు కూడా ఇలా చేయడం ఆశ్చర్యం కలిగించింది. విమర్శించడం తప్పుకాదు, కానీ లేనివి, అబద్ధాలు సృష్టించకూడదు. మీడియా పవిత్రంగా ఉండాలి" అని ఆయన హితవు పలికారు. తాను ఎవరినీ నిందించడం లేదని, ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతానికి కేసుల జోలికి వెళ్లకుండా, తన మనోవేదనను పంచుకునేందుకే ఈ అవకాశం తీసుకున్నానని కొమ్మినేని శ్రీనివాసరావు వివరించారు.

Kommineni Srinivasa Rao
YS Jagan Mohan Reddy
YS Bharathi Reddy
KSR Live Show
Telugu Journalist
Defamation Case
Andhra Pradesh Politics
YSRCP
Journalism Ethics
Media Integrity

More Telugu News