Arya: నటుడు ఆర్య ఇంట్లో ఐటీ దాడులు

Actor Aryas house raided by IT department
  • సీ షెల్ రెస్టారెంట్లలోనూ అధికారుల తనిఖీలు
  • పన్ను ఎగవేత ఆరోపణలే కారణమని సమాచారం
  • ఆర్య ఈ రెస్టారెంట్ చైన్‌ను గతంలో విక్రయించినట్లు సమాచారం
  • కేరళ వ్యాపారితో లావాదేవీలపై ఐటీ అధికారుల దృష్టి
చెన్నైలోని "సీ షెల్" రెస్టారెంట్లపై ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు బుధవారం ఉదయం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ రెస్టారెంట్ చైన్‌తో గతంలో సంబంధాలున్న ప్రముఖ తమిళ నటుడు ఆర్య నివాసంలోనూ ఏకకాలంలో సోదాలు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. అన్నా నగర్, వేలచ్చేరి సహా నగరంలోని పలు "సీ షెల్" రెస్టారెంట్ శాఖలలో ఉదయం నుంచే ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.

వివరాల్లోకి వెళితే.. ఈరోజు ఉదయం ఐటీ అధికారుల బృందాలు "సీ షెల్" రెస్టారెంట్ల కార్యాలయాలు, శాఖలకు చేరుకున్నాయి. అన్నా నగర్ బ్రాంచ్‌లో ఐదుగురికి పైగా అధికారులు రెండు వాహనాల్లో ఉదయం 8 గంటలకు చేరుకుని తనిఖీలు ప్రారంభించినట్లు తెలిసింది. పోలీసుల బందోబస్తు నడుమ ఐటీ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో పూనమల్లి హై రోడ్‌ లో ఉన్న నటుడు ఆర్య నివాసంలో కూడా మరో ఐటీ బృందం సోదాలు చేపట్టింది.

గతంలో నటుడు ఆర్య ఈ అరేబియన్ రెస్టారెంట్ చైన్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత ఆర్య ఈ రెస్టారెంట్లను కేరళకు చెందిన కున్హి మూసా అనే వ్యాపారవేత్తకు విక్రయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కేరళలో కున్హి మూసాకు సంబంధించిన ఆస్తులపై ఐటీ శాఖ నిఘా పెట్టిందని, ఆ విచారణలో భాగంగానే చెన్నైలోని ఈ రెస్టారెంట్లు, ఆర్య నివాసంపై దాడులు జరుగుతున్నాయని భావిస్తున్నారు.

ప్రధానంగా రెస్టారెంట్ ఆర్థిక లావాదేవీలు, యాజమాన్య మార్పులకు సంబంధించిన అంశాలపై ఐటీ అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. నటుడు ఆర్య కేరళకు చెందినవాడైనప్పటికీ, "అరిన్తుమ్ అరియామలుమ్" సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసి, పలు విజయవంతమైన చిత్రాలతో స్టార్‌గా ఎదిగారు. ప్రస్తుతం ఆయన పా. రంజిత్ దర్శకత్వంలో "వెట్టువమ్" చిత్రంలో నటిస్తున్నారు. ఈ దాడులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Arya
Actor Arya
IT raids
Sea Shell restaurant
Chennai
Income Tax Department
Kunhi Moosa
Tamil cinema
Vettuvam movie
Financial transactions

More Telugu News