Chevireddy Bhaskar Reddy: చంద్రబాబుకు భయం పుట్టాలి: కార్యకర్తలకు చెవిరెడ్డి వాయిస్ మెసేజ్

Chevireddy Bhaskar Reddy Voice Message to Party Workers after arrest
  • ఏపీ మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి అరెస్ట్
  • శ్రీలంకకు వెళుతుండగా బెంగళూరులో అరెస్ట్
  • జగన్ వెంట నడిచేవారిపై అక్రమ కేసులు పెడుతున్నారన్న చెవిరెడ్డి
  • సంబంధం లేని కేసులో తనను ఇరికించారని మండిపాటు
  • పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనాలని శ్రేణులకు పిలుపు
ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని సిట్ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బెంగళూరు నుంచి శ్రీలంకకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని, సిట్ అధికారులకు సమాచారం అందించారు. అనంతరం నిన్న రాత్రి ఆయన్ను అరెస్టు చేసి విజయవాడకు తరలించారు.

ఈ అరెస్టు నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పార్టీ కార్యకర్తలు, నాయకులకు ఒక వాయిస్ మెసేజ్‌ను పంపించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసని, వైసీపీ అధినేత వెంట నడిచే వారిపై కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తోందని ఆయన ఆరోపించారు. "ఎన్ని కేసులు పెట్టినా తట్టుకుని నిలబడతాను. మీ అందరి ఆశీస్సులు నాకు ఉన్నాయి" అని చెప్పారు.

"పార్టీ కార్యక్రమాలు ఇప్పుడు ఊపందుకున్నాయి. వాటిని విజయవంతం చేయాలి. జగన్ అన్నకు మనం ఒక సైన్యంలా నిలబడాలి. ఆయన అడుగుజాడల్లో నడవాలి" అని చెవిరెడ్డి పిలుపునిచ్చారు. "చంద్రబాబు నాయుడు నన్ను జైలుకు పంపుతాడనే ప్రచారం జరుగుతోంది. ఏ సంబంధం లేని నన్ను ఈ కేసులో ఇరికించారు. వారు ఏం చేసినా మనం జగన్ అన్న సైనికులం, గట్టిగా నిలబడతాం. చంద్రబాబుకు భయం పుట్టేలా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలి, పార్టీ కోసం నిత్యం పనిచేయాలి" అని ఆయన కార్యకర్తలను ఉత్తేజపరిచారు. తాను బయటకు వచ్చాక మళ్లీ మాట్లాడతానని, తాను, తన కుటుంబ సభ్యులు జగన్‌కు సైనికులమని, ప్రతి ఒక్కరూ వెనకడుగు వేయకుండా పార్టీ కార్యక్రమాలలో పాల్గొనాలని చెవిరెడ్డి కోరారు. 
Chevireddy Bhaskar Reddy
YS Jagan Mohan Reddy
Chandrababu Naidu
Andhra Pradesh Politics
Liquor Scam Case
YSRCP
TDP
AP Politics
Arrest
Voice Message

More Telugu News