Revanth Reddy: హైదరాబాద్‌లో గూగుల్ సంస్థకు మా 'వాళ్లే' పోటీ!: సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy Says Telangana Women Compete with Google in Hyderabad
  • హైదరాబాద్‌లో గూగుల్ సేఫ్టీ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
  • డిజిటల్ భద్రతే ఈ కేంద్రం ప్రధాన ఉద్దేశమని వెల్లడి
  • నైపుణ్యాభివృద్ధికి రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామన్న సీఎం
  • 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని వెల్లడి
హైటెక్ సిటీలో గూగుల్ సెక్యూరిటీ ఇంజినీరింగ్ సెంటర్ 2 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా, దానికి సమీపంలోనే ఇందిరా మహిళా శక్తి సెంటర్ మూడున్నర ఎకరాల్లో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ మహిళలు గూగుల్‌కు గట్టి పోటీ అని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు.

బుధవారం హైదరాబాద్‌లో గూగుల్ సంస్థ ఏర్పాటు చేసిన సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్‌ను (జీఎస్‌ఈసీ) ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రపంచం వేగంగా డిజిటల్ యుగం వైపు పయనిస్తోందని, ఈ నేపథ్యంలో డిజిటల్ సమాచార భద్రత ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. ప్రజల డిజిటల్ సమాచారం సురక్షితంగా ఉన్నప్పుడే వారు క్షేమంగా ఉన్నట్లు భావించాలని ఆయన అభిప్రాయపడ్డారు.

హైదరాబాద్‌లో గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్‌ను ప్రారంభించడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. డిజిటల్ భద్రతను పెంపొందించడమే ఈ కేంద్రం యొక్క ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

"గూగుల్ ఒక ఇన్నోవేటివ్ కంపెనీ, మా ప్రభుత్వం కూడా ఇన్నోవేటివ్‌గానే పని చేస్తుంది. రాష్ట్రంలో యువత నైపుణ్యాలను పెంచేందుకు ప్రత్యేకంగా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం" అని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు ఉత్తమ గమ్యస్థానంగా మారుతోందని, అందుకు తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే కారణమని వివరించారు.

రాష్ట్ర ఆర్థిక ప్రగతి లక్ష్యాలను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రస్తావించారు. "2035 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం" అని ఆయన పేర్కొన్నారు.

'తెలంగాణ రైజింగ్' కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టామని వెల్లడించారు. "ఇక్కడి మహిళలు కేవలం లబ్ధిదారులుగా మిగిలిపోకుండా, ధనిక పెట్టుబడిదారులకు దీటైన పోటీదారులుగా ఎదుగుతున్నారు. ప్రభుత్వంలో ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలు, వినూత్న విధానాలు తీసుకొస్తున్నాం" అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు.

Revanth Reddy
Telangana
Google
Safety Engineering Center
Hyderabad
Digital Security

More Telugu News