Nara Lokesh: అమిత్ షాతో మంత్రి నారా లోకేశ్ భేటీ

Nara Lokesh Meets Amit Shah in Delhi
  • రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఇరువురి మధ్య చర్చ
  • సాయంత్రం మరికొందరు కేంద్ర మంత్రులతో లోకేశ్‌ భేటీ అయ్యే అవకాశం
  • ఉదయం ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌తోనూ సమావేశమైన మంత్రి
ఏపీ మంత్రి నారా లోకేశ్‌ బుధవారం ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఈ భేటీ దాదాపు 25 నిమిషాల పాటు సాగింది. రాష్ట్రానికి సంబంధించిన అనేక కీలకమైన అంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.

ఈ సందర్భంగా ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, కేంద్ర సహకారంతో అమలుచేస్తున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతి, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను లోకేశ్ వివరించారు. ఈనెల 21న విశాఖలో ప్రధాని మోదీ హాజరయ్యే యోగాంధ్ర కార్యక్రమానికి విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రాజెక్టుల పురోగతిని వివరిస్తూ కొత్తప్రాజెక్టులకు కేంద్రం సహకారం అందించాలని కోరారు. 

యువగళం పాదయాత్ర అనుభవాలతో రూపొందించిన యువగళం పుస్తకాన్ని అమిత్ షాకు అందజేశారు. సుదీర్ఘ పాదయాత్రతో ప్రజల్లో చైతన్యాన్ని నింపిన లోకేశ్‌ను అమిత్ షా ప్రత్యేకంగా అభినందించారు. చంద్రబాబు సుదీర్ఘ పాలన అనుభవం ఏపీని అభివృద్ధి బాటలో నడిపిస్తుంది, ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారుకు కేంద్ర సహకారం కొనసాగుతుందని అమిత్ షా భరోసా ఇచ్చారు.

ఈ సమావేశం అనంతరం లోకేశ్‌ మరికొందరు కేంద్ర మంత్రులను కూడా కలవనున్నట్లు స‌మాచారం. కేంద్ర మంత్రులు చిరాగ్ పాశ్వాన్, అర్జున్‌రామ్ మేఘ్వాల్‌ను ఆయ‌న క‌ల‌వ‌నున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా లోకేశ్  ఈరోజు ఉదయం భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌తో కూడా మర్యాదపూర్వకంగా భేటీ అయిన విషయం తెలిసిందే. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై కేంద్ర ప్రభుత్వ పెద్దలతో వరుస భేటీలు నిర్వహిస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Nara Lokesh
Amit Shah
Andhra Pradesh
AP Minister
Central Government
Delhi Visit
Jagdeep Dhankhar
Chirag Paswan
Arjun Ram Meghwal

More Telugu News