Air India: నెలల క్రితమే కొత్త ఇంజిన్, రూ.4000 కోట్లకు పైగా బీమా: ఎయిరిండియా విమాన ప్రమాద దర్యాప్తులో కీలక విషయాలు

Air India Flight Crash Investigation Reveals Key Details
  • అహ్మదాబాద్‌లో జూన్ 12న ఘోర ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం
  • హాస్టల్ భవనంపై కూలిన విమానం, దుర్ఘటనలో 274 మంది దుర్మరణం
  • ప్రమాదానికి గురైన విమానం ఇంజిన్‌ను 3 నెలల క్రితమే మార్చినట్లు గుర్తింపు
  • రూ.4,091 కోట్ల భారీ బీమా క్లెయిమ్ అయ్యే అవకాశం
  • దేశంలో ఇదే అతిపెద్ద విమాన బీమా క్లెయిమ్ కావచ్చంటున్న నిపుణులు
  • విమానం నష్టంతో పాటు ప్రయాణికుల పరిహారం కలిపి భారీ మొత్తం
అహ్మదాబాద్‌లో ఇటీవల జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాద ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. జూన్ 12న సంభవించిన ఈ దుర్ఘటనలో 274 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై కొనసాగుతున్న దర్యాప్తులో పలు కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.

సుమారు 12 సంవత్సరాలుగా వినియోగంలో ఉన్న ఈ బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్‌ విమానం కుడివైపు ఇంజిన్‌ను కేవలం మూడు నెలల క్రితమే ఓవర్‌హాలింగ్ సమయంలో అమర్చినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఈ విమానానికి చివరిసారిగా జూన్ 2023లో నిర్వహణ పనులు చేపట్టగా, తదుపరి షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 2025లో నిర్వహించాల్సి ఉంది.

ఇదిలా ఉండగా, ప్రమాదానికి గురైన విమానానికి సంబంధించిన బీమా వివరాలు చర్చనీయాంశంగా మారాయి. ఈ ప్రమాదం కారణంగా దేశ చరిత్రలోనే అతిపెద్ద విమాన బీమా క్లెయిమ్ నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రమాదానికి గురైన ఈ బోయింగ్ డ్రీమ్‌లైనర్‌ విమానానికి సంబంధించి ఎయిర్ ఇండియా సంస్థ బీమా కవరేజీని ఇంజిన్ మార్పిడికి ముందే రూ.750 కోట్ల నుంచి రూ.850 కోట్లకు పెంచింది.

కాగా, ఈ ప్రమాదానికి సంబంధించి ప్రభుత్వ రంగ నాన్-లైఫ్ ఇన్స్యూరెన్స్ దిగ్గజం జనరల్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జీఐసీ) మొత్తం క్లెయిమ్‌లు సుమారు 475 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.4,091 కోట్లు)గా అంచనా వేసింది. ఇది మన దేశంలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక విమాన బీమా క్లెయిమ్‌గా రికార్డు సృష్టించే అవకాశం ఉంది.

ఈ భారీ మొత్తంలో విమానం నష్టానికి గాను 125 మిలియన్ డాలర్లు కాగా, ప్రయాణికుల కుటుంబాలకు చెల్లించాల్సిన పరిహారం, థర్డ్ పార్టీ నష్టాలు, ఇతర వ్యక్తులకు జరిగిన నష్టాలు, ట్రావెల్ పాలసీల కింద మరో 350 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని జనరల్ ఇన్స్యూరెన్స్ సీఎండీ రామస్వామి నారాయణన్ వెల్లడించారు.

ప్రమాదం కారణంగా ఎయిర్ ఇండియా చెల్లించాల్సిన పరిహారం, నష్టాల చెల్లింపులు వంటివి కూడా కలిసి విమానం అసలు ఖరీదు కంటే దాదాపు రెండున్నర రెట్లు అధికంగా ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.
Air India
Air India Flight Accident
Boeing 787 Dreamliner
Aircraft Insurance Claim
GIC India

More Telugu News