Raja Saab: 'రాజాసాబ్' వీడియోతో హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసుల పోస్ట్.. సోషల్ మీడియాలో వైరల్!

Hyderabad Traffic Police Use Prabhas Raja Saab for Road Safety
  • 'రాజాసాబ్' సినిమా డైలాగులతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల అవగాహన వీడియో
  • 'బండి కొంచెం మెల్లగా' అంటూ రోడ్డు భద్రతపై సృజనాత్మక సందేశం
  • ఈనెల‌ 16న విడుదలైన మూవీ టీజర్‌కు అద్భుత స్పందన
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోలీసుల వీడియో
  • మారుతి దర్శకత్వంలో 'రాజాసాబ్' డిసెంబర్ 5న థియేటర్లలోకి
ప్రస్తుతం సినీ అభిమానులను ఉర్రూతలూగిస్తున్న పేరు 'రాజాసాబ్'. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన టీజర్ ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా ప్రభాస్ తన పాత చిత్రాల్లో కనిపించిన తరహాలో హాస్యభరితమైన పాత్రలో కనిపిస్తుండటం, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ టీజర్ క్రేజ్‌ను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు వినూత్నంగా ఉపయోగించుకున్నారు.

ఈనెల‌ 16న 'రాజాసాబ్' టీజర్ తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైంది. తెలుగు టీజర్‌లోని 'బండి కొంచెం మెల్లగా', 'అసలే మన లైఫ్ అంతంతమాత్రం' వంటి డైలాగులు సోషల్ మీడియాలో పాప్యుల‌ర్ అయ్యాయి. ఈ పాప్యులారిటీని సద్వినియోగం చేసుకుంటూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిన్న ఒక ప్రత్యేక అవగాహన వీడియోను రూపొందించి విడుదల చేశారు.

ఈ వీడియోలో ప్రజలకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించడానికి ప్రభాస్ డైలాగులను చాలా తెలివిగా ఉపయోగించారు. ప్రభాస్ నటించిన 'సాహో' చిత్రంలోని "ఇట్స్ షో టైమ్" అనే డైలాగుతో వీడియో మొదలవుతుంది. ఆ వెంటనే, మితిమీరిన వేగంతో వెళ్తున్న ఒక బైక్ దృశ్యం కనిపిస్తుంది. అప్పుడు 'రాజాసాబ్' టీజర్‌లోని "హలో హలో బండి కొంచెం మెల్లగా" అనే డైలాగ్ వినిపిస్తుంది. 

దీనికి కొనసాగింపుగా, 'మిర్చి' సినిమాలో ప్రభాస్ నెమ్మదిగా బైక్‌పై వెళ్తున్న సన్నివేశాన్ని జోడించారు. ఆ తర్వాత 'రాజాసాబ్'లోని "అసలే మన లైఫ్ అంతంతమాత్రం" అనే డైలాగ్ ప్లే అవుతుంది. చివరగా 'మిర్చి' సినిమాలోని ప్రభాస్ హెల్మెట్ తీస్తున్న సన్నివేశాన్ని చూపిస్తూ, "హెల్మెట్ ధరించండి, నెమ్మదిగా వెళ్లండి" అనే స్పష్టమైన సందేశాన్ని ప్రజలకు అందించారు.

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. దీనికి "#HYDTPweBringAwareness" అనే హ్యాష్‌ట్యాగ్‌తో పాటు "హలో... హలో....! బండి కొంచెం మెల్లగా డ్రైవ్ చేయండి డార్లింగ్" అని పేర్కొన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక‌, ప్రముఖ దర్శకుడు మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రాజాసాబ్' చిత్రం రొమాంటిక్ హారర్ కామెడీ జానర్‌లో ఫాంటసీ అంశాలతో రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్ 5న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. వాస్తవానికి ఈ సినిమా ముందుగానే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ, భారీ విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా ఆలస్యమైందని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఇటీవల ఒక సందర్భంలో తెలిపారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 
Raja Saab
Prabhas
Hyderabad Traffic Police
Road Safety
Traffic Awareness
Maruthi
Malavika Mohanan
Nidhi Agarwal
Saaho
Mirchi

More Telugu News