YS Jagan Mohan Reddy: కూటమి గెలిచాక వారిని ఊరు విడిచి వెళ్లిపోమన్నారు: పల్నాడు జిల్లాలో జగన్ తీవ్ర ఆరోపణలు

YS Jagan Alleges Atrocities After Coalition Victory in Palnadu
  • పల్నాడు జిల్లా రెంటపాళ్లలో మాజీ సీఎం జగన్ పర్యటన
  • ఆత్మహత్య చేసుకున్న ఉపసర్పంచ్ నాగమల్లేశ్వరరావు కుటుంబానికి పరామర్శ
  • ఏపీలో అభివృద్ధి, సంక్షేమం లేవని, 'రెడ్ బుక్ రాజ్యాంగం' నడుస్తోందని విమర్శ
  • నాగమల్లేశ్వరరావును బెదిరించిన సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, పల్నాడు జిల్లా, సత్తెనపల్లి మండలం, రెంటపాళ్ల గ్రామానికి చెందిన కోర్లకుంట వెంకటేశ్వరరావు కుటుంబానికి జరిగిన అన్యాయమే దీనికి నిదర్శనమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన రెంటపాళ్లలో పర్యటించి, ఆత్మహత్యకు పాల్పడిన నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంతకుముందు నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు.

"పోలీసు వేధింపులతోనే ఆత్మహత్య"

గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ రోజున రెంటపాళ్ల ఉపసర్పంచ్‌గా ఉన్న నాగమల్లేశ్వరరావుపై తెలుగుదేశం, జనసేన నాయకులు తప్పుడు ఆరోపణలు చేశారని జగన్ ఆరోపించారు. ఆ ఆరోపణలతో పోలీసులు ఆయనను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి తీవ్రంగా అవమానించారని అన్నారు. ఎన్నికల్లో కూటమికి అనుకూల ఫలితాలు వచ్చిన తర్వాత నాగమల్లేశ్వరరావు ఇంటిపై దాడులు చేసి, ఊరు విడిచి వెళ్లిపోవాలని, లేకపోతే రౌడీ షీట్ తెరుస్తామని స్వయంగా సీఐ బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు.

"జూన్ 5వ తేదీ రాత్రి పోలీసులు నాగమల్లేశ్వరరావును వదిలిపెట్టగా, ఆయన నేరుగా గుంటూరులోని తన సోదరుడి ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి తన తండ్రి వెంకటేశ్వరరావుకు ఫోన్ చేసి, పోలీసులు తనను బెదిరించిన తీరును వివరించారు. పోలీసుల వేధింపుల వల్లే నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తండ్రి ఎంత ప్రయత్నించినా కుమారుడిని కాపాడుకోలేకపోయారు" అని జగన్ ఆవేదనగా చెప్పారు.

"రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది"

రాష్ట్రంలో అభివృద్ధి గానీ, సంక్షేమం గానీ కనిపించడం లేదని, కేవలం 'రెడ్ బుక్ రాజ్యాంగం' మాత్రమే అమలవుతోందని జగన్ విమర్శించారు. "రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయనడానికి ఈ ఆంక్షలే నిదర్శనం. ఎన్నికల ఫలితాల సమయంలో తమకు అనుకూలమైన పోలీసు అధికారులను నియమించుకుని, కూటమిని గెలిపించుకోవడానికి అనేక అన్యాయాలకు పాల్పడ్డారు. ఈ విషయం ఈ ప్రాంత ప్రజలందరికీ తెలుసు" అని అన్నారు.

నాగమల్లేశ్వరరావు ఇంటిపై దాడి చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఆయన తండ్రి వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని జగన్ ఆరోపించారు. "నాగమల్లేశ్వరరావును బెదిరించిన ఆ సీఐపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? భార్య, కుమార్తె ఉన్న నాగమల్లేశ్వరరావు కుటుంబానికి చంద్రబాబు ఏం సమాధానం చెబుతారు? ఘటన జరిగి ఏడాది గడిచినా ఆ కుటుంబం ఇంకా శోకంలోనే ఉంది" అని జగన్ ప్రశ్నించారు.

ఇదే నియోజకవర్గంలో లక్ష్మీనారాయణ అనే మరో వైఎస్సార్‌సీపీ కార్యకర్త కూడా పోలీసుల వేధింపులు భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడని, ప్రస్తుతం ఆయన చావుబతుకుల మధ్య ఉన్నాడని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
YS Jagan Mohan Reddy
Andhra Pradesh
Palnadu district
Nagamalleswara Rao
police harassment

More Telugu News