Varla Ramaiah: "వై నాట్ 175" నినాదమే కొంపముంచింది.. ఆ ఆత్మహత్యకు జగన్ పరోక్షంగా కారణం: వర్ల రామయ్య

Varla Ramaiah Alleges Jagan Indirectly Caused YCP Worker Suicide
  • వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు మృతికి జగనే కారణమన్న వర్ల రామయ్య
  • "వై నాట్ 175" నినాదంతో కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపణ
  • బెట్టింగుల్లో నష్టపోయి నాగమల్లేశ్వరరావు మృతి చెందారని వెల్లడి
  • జగన్ ఆపద్ధర్మ సీఎంగా ఉన్నప్పుడే ఘటన జరిగిందని స్పష్టం
  • జగన్ ఓదార్పు యాత్రపైనా వర్ల రామయ్య విమర్శలు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు మృతికి మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పరోక్షంగా కారణమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత నాగమల్లేశ్వరరావు మరణించారని, ఆ సమయంలో జగనే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారని ఆయన గుర్తుచేశారు.

టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ, "వై నాట్ 175 అంటూ జగన్ పదేపదే చేసిన నినాదం వైసీపీ కార్యకర్తల మనసుల్లో బలంగా నాటుకుపోయింది. మనమే అధికారంలోకి వస్తున్నామని ఆయన నమ్మబలికారు" అని అన్నారు. నాగమల్లేశ్వరరావును "బెట్టింగ్ కింగ్"గా అభివర్ణించిన రామయ్య, జగన్ గెలుస్తాడనే నమ్మకంతో ఆయన పెద్ద మొత్తంలో బెట్టింగ్‌లు కాసినట్లు తెలిపారు.

"వైసీపీ గెలుస్తుందని ఆయన భారీగా పందెం వేశారు. అంతేకాకుండా, ఇతర గ్రామాల నుంచి కూడా బెట్టింగ్‌కు సంబంధించిన లక్షలాది రూపాయలు ఆయన వద్దకు చేరాయి. వాటిని కూడా మళ్ళీ బెట్టింగ్‌లో పెట్టారు. 'వై నాట్ 175' అని జగన్ చెప్పిన మాటతో ఆ వైసీపీ క్రియాశీలక కార్యకర్త కొంప మునిగింది. పరోక్షంగా జగనే ఆయనను ఆత్మహత్యకు పురిగొల్పారు. జగన్ పదేపదే చెప్పడం వల్లే ఆయన పూర్తి విశ్వాసంతో బెట్టింగ్ పెట్టారు" అని వర్ల రామయ్య ఆరోపించారు.

జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత నాగమల్లేశ్వరరావుపై ఒత్తిడి పెరిగిందని రామయ్య వివరించారు. "చంద్రబాబు నాయుడు జూన్ 12న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ అప్పటి వరకు జగన్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే నాగమల్లేశ్వరరావు చనిపోయారు. ఆనాటి ప్రభుత్వ ఒత్తిడి వల్లే ఆయన మరణించారని చెబుతున్నారు. ఆ ప్రభుత్వం ఏదో కాదు, అప్పటికి చంద్రబాబు ఇంకా ముఖ్యమంత్రి కాలేదు. మీరే (జగన్) ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు" అని వర్ల రామయ్య స్పష్టం చేశారు.

జగన్ చేపట్టే ఓదార్పు యాత్రల గురించి ప్రస్తావిస్తూ, "జగన్ ఓదార్పు యాత్ర అంటే ప్రజలు భయపడుతున్నారు. నాగమల్లేశ్వరరావు చనిపోయిన రోజే ఓదార్పు యాత్ర ఎందుకు చేయలేదు?" అని వర్ల రామయ్య ప్రశ్నించారు. ఈ ఘటనపై జగన్ వైఖరిని ఆయన తీవ్రంగా విమర్శించారు. వాస్తవానికి చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడవద్దని, కానీ నిజాలు చెప్పక తప్పడం లేదని అన్నారు. నేరం చేసిన వారిని జగన్ ఎందుకు అక్కున చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు.
Varla Ramaiah
YS Jagan Mohan Reddy
Nagamalleswararao
TDP
YCP
Andhra Pradesh Politics

More Telugu News