Nara Lokesh: కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయతో మంత్రి లోకేశ్‌ భేటీ

Nara Lokesh Seeks Support from Mansukh Mandaviya for AP Sports Development
  • అమరావతిలో స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి సహకారం అందించాల‌ని విజ్ఞ‌ప్తి
  • ఏపీని స్పోర్ట్స్ హబ్‌గా మార్చేందుకు చేయూత ఇవ్వాల‌ని కోరిన లోకేశ్‌
  • రాష్ట్రంలోని 26 జిల్లాల్లో జిల్లాస్థాయి ఖేలో ఇండియా సెంటర్ల ఏర్పాటుకు అభ్య‌ర్థ‌న‌
అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి సహకారం అందించాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు, కార్మిక, ఉపాధి శాఖల మంత్రి మన్సుఖ్ మాండవీయను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌ కోరారు. న్యూఢిల్లీలో కేంద్రమంత్రి మన్సుఖ్ తో లోకేశ్‌  భేటీ అయ్యారు. 

ఈ సందర్భంగా మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ... అమరావతిలో రాజధాని నిర్మాణపనులు శరవేగంగా కొనసాగుతున్నాయి, స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి సహకారం అందించాలని కోరారు. క్రీడల అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. ప్రపంచస్థాయి శిక్షణ, సౌకర్యాలను కల్పించడం, జాతీయ, అంతర్జాతీయ వేదికలపై వివిధ క్రీడావిభాగాల్లో అథ్లెట్లకు మద్దతు నివ్వడం స్పోర్ట్స్ సిటీ ప్రధాన లక్ష్యం. 

ఆంధ్రప్రదేశ్ ను స్పోర్ట్స్ హబ్ గా మార్చడానికి సహకారం అందించండి. రాష్ట్రంలోని పాఠశాలలు, గ్రామ స్థాయి నుంచి క్రీడల అభివృద్ధికి చేయూతను అందించండి. కేంద్ర క్రీడల మంత్రిత్వశాఖ ఆధ్వర్యాన గుంటూరు సమీపాన నాగార్జున యూనివర్సిటీలో అథ్లెటిక్స్, ఆర్చరీ, వెయిట్ లిఫ్టింగ్, కాకినాడ డిస్టిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్స్ లో హాకీ, షూటింగ్ లకు సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లను ఏర్పాటు చేయండి. 

ఖేలో ఇండియా పథకంలో క్రీడా మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా 39 ప్రాజెక్టులకు సంబంధించి రూ. 341.57 కోట్లతో ఏపీ ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనలకు త్వరితగతిన ఆమోదం తెలపండి. తిరుపతిలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) రీజనల్ సెంటర్‌ను ఏర్పాటు చేయండి. ఖేలో ఇండియాలో భాగంగా అథ్లెటిక్స్, రెజ్లింగ్ స్టేట్ లెవల్ సెంటర్‌ను తిరుపతిలో నెలకొల్పండి. 

రాష్ట్రంలోని 26 జిల్లాల్లో జిల్లాస్థాయి ఖేలో ఇండియా సెంటర్లను ఏర్పాటు చేయండి. దేశవ్యాప్తంగా క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రైల్వే స్పోర్ట్స్ కన్సెషన్ పాస్ లను మంజూరు చేయండి. ఏపీలో ఈఎస్ఐ హాస్పిటల్స్ అభివృద్ధికి సహకరించండి అని లోకేశ్‌ విజ్ఞప్తి చేశారు. 

కేంద్రమంత్రి మాండవీయ స్పందిస్తూ... ఏపీని స్పోర్ట్స్ హబ్ గా మార్చేందుకు పూర్తిస్థాయిలో సహకరిస్తామ‌న్నారు. ఈఎస్ఐ హాస్పిటల్స్ సేవలను మరింత విస్తృత పరుస్తామని హామీ ఇచ్చారు. అనంతరం యువగళం పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయకు మంత్రి లోకేశ్ అందజేశారు.
Nara Lokesh
Andhra Pradesh
Sports City
Khelo India
Mansukh Mandaviya
AP Sports Hub
Sports Authority of India
SAI Regional Center
AP ESI Hospitals
Youth Affairs and Sports

More Telugu News