Harsha Kumar: పాస్టర్ ప్రవీణ్ మృతిపై పిల్ .. మాజీ ఎంపీ హర్షకుమార్‌కు షాక్ ఇచ్చేలా హైకోర్టు కీలక ఆదేశాలు

Harsha Kumar Faces Setback in Pastor Praveen Death Case PIL
  • పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై హైకోర్టులో హర్షకుమార్ పిల్ 
  • అధారాలు ఉన్నాయా అని ప్రశ్నించిన హైకోర్టు
  • రెండు పిల్స్ దాఖలై ఉండగా మరో పిల్ ఎందుకని వ్యాఖ్యానించిన ధర్మాసనం
  • రిజిస్ట్రీకి రూ.5లక్షలు జమ చేయాలని హర్షకుమార్‌‌కు హైకోర్టు ఆదేశం 
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)లో మాజీ ఎంపీ హర్షకుమార్‌కు హైకోర్టు షాక్ ఇచ్చింది. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ మాజీ ఎంపీ హర్షకుమార్ పిల్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం నిన్న విచారణకు స్వీకరించింది. పిటిషనర్ తరపు న్యాయవాది బి. బాల వాదనలు వినిపిస్తూ, పాస్టర్ ప్రవీణ్ మరణంలో వాస్తవాలు వెలుగులోకి రావాలంటే మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

ఈ క్రమంలో ధర్మాసనం పలు ప్రశ్నలు సంధించింది. ప్రవీణ్ హత్యకు గురయ్యాడనేందుకు ఆధారాలు ఉన్నాయా అని పిటిషనర్ హర్షకుమార్ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. అంతేకాకుండా మద్యం దుకాణం వద్ద ప్రవీణ్ ఉన్నట్లు ఫోటోలు, ఆ తర్వాత వాహనం నడిపినట్లు ఆధారాలు ఉన్నాయని, ఆ రెండు చర్యలు ప్రమాదకర కలయిక అని వ్యాఖ్యానించింది.

పిల్ వేయడానికి పిటిషనర్ ప్రవీణ్ కుటుంబ సభ్యులు కారు కదా అని ప్రశ్నించింది. ఇప్పటికే ఈ వ్యవహారంపై రెండు పిల్‌లు దాఖలై ఉండగా, మరో పిల్ వేయాల్సిన అవసరం ఏముందని కూడా ప్రశ్నించింది. హైకోర్టు రిజిస్ట్రీ వద్ద రెండు వారాల్లో రూ.5 లక్షలు జమ చేయాలని హర్షకుమార్‌ను ఆదేశించింది. సొమ్ము జమ చేసిన తర్వాత పిల్‌పై విచారణ జరుపుతామని పేర్కొంది. గతంలో దాఖలైన పిటిషన్లతో దీనిని జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. 
Harsha Kumar
Pastor Praveen Pagadala
Andhra Pradesh High Court
PIL
Re-postmortem
Court Order
Justice Dheeraj Singh Thakur
Cheemalapati Ravi
Political News
Praveen death case

More Telugu News