Abhishek Bachchan: ఇష్టమైన వారి కోసం ఉన్నదంతా ఇచ్చేశాను: అభిషేక్ బచ్చన్

Abhishek Bachchan Takes a Break for Himself
  • కొన్ని రోజులు అన్నింటికీ దూరంగా ఉండాలనుకుంటున్నట్లు అభిషేక్ బచ్చన్ వెల్లడి
  • తనను తాను తెలుసుకునేందుకే ఈ నిర్ణయమన్న బాలీవుడ్ నటుడు
  • ఇన్‌స్టాగ్రామ్‌లో అభిషేక్ పెట్టిన పోస్ట్ వైరల్
బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. తాను కొంతకాలం పాటు అందరికీ దూరంగా ఉండాలని, ఈ జనసందోహం నుంచి విరామం తీసుకోవాలని అనుకుంటున్నట్లు ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు. సాధారణంగా సోషల్ మీడియాకు దూరంగా ఉండే అభిషేక్, నిన్న రాత్రి ఈ ఆసక్తికరమైన సందేశాన్ని పంచుకున్నారు.

"నేను కొన్ని రోజులు అన్నింటికీ దూరంగా ఉండాలనుకుంటున్నాను. ఈ జన సమూహానికి దూరంగా ఉంటూ నన్ను నేను తెలుసుకోవాలనుకుంటున్నా. నాకెంతో ఇష్టమైన వారికోసం ఉన్నదంతా ఇచ్చేశాను. ఇప్పుడు నాకోసం సమయం కేటాయించుకోవాలనిపిస్తోంది. నన్ను నేను తెలుసుకోవడానికి సమయం కావాలి" అని అభిషేక్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. దీనికి తోడు, "కొన్నిసార్లు నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే.. అందరికీ దూరంగా ఉండాలి" అనే వ్యాఖ్యను కూడా జోడించారు.

అభిషేక్ చేసిన ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్‌గా మారడంతో, అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. "మీరు నటనకు కొంతకాలం విరామం ప్రకటిస్తున్నారా?" అని ఒక అభిమాని ప్రశ్నించగా, "త్వరలోనే ఓ కొత్త అభిషేక్‌ను చూడబోతున్నాం," అంటూ మరో నెటిజన్ తన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపారు. ఆయన నిర్ణయం వెనుక గల కారణాలపై పలువురు ఆసక్తి కనబరుస్తున్నారు.

సినిమాల విషయానికొస్తే, అభిషేక్ బచ్చన్ చివరిసారిగా 'హౌస్‌ఫుల్‌ 5' చిత్రంలో కనిపించారు. అక్షయ్‌కుమార్‌ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌లో రితేశ్‌ దేశ్‌ముఖ్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, సంజయ్‌ దత్‌, జాకీ ష్రాఫ్‌ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం అభిషేక్ 'రాజా శివాజీ' అనే ప్రతిష్ఠాత్మక చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు రితేశ్‌ దేశ్‌ముఖ్‌ దర్శకత్వం వహిస్తుండగా, జెనీలియా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది.

Abhishek Bachchan
Bollywood
actor
Housefull 5
Raja Shivaji
Riteish Deshmukh
Genelia D'Souza
social media
acting break

More Telugu News