Jagan: సాక్ష్యాలు క్రియేట్ చేసి మరీ తప్పుడు కేసులు: జగన్

Jagan Slams Government for Creating False Evidence in Cases
  • ఇరికించాలని అనుకుంటే ఎవరినైనా ఇరికించవచ్చు
  • చెవిరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నందిగం సురేశ్, వల్లభనేని వంశీ తదితరులపై కేసుల ప్రస్తావన
  • ఇట్లాంటి వాటివల్లే నక్సలిజం పుడుతుందంటూ జగన్ సంచలన వ్యాఖ్యలు
తన చుట్టూ ఉన్న నాయకులను తప్పుడు కేసుల్లో ఇరికించి వేధించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలను జైలుకు పంపడమే విధిగా పెట్టుకుందని మండిపడ్డారు. ఈ తప్పుడు కేసులకు సంబంధించి చంద్రబాబు అనుసరిస్తున్న మోడస్ అపరెండి ఒక్కటే.. చిన్నస్థాయి వ్యక్తులను పట్టుకుని కొట్టి బెదిరించి, ప్రలోభ పెట్టి వాంగ్మూలం తీసుకోవడం, దాని ఆధారంగా నేతలను అరెస్టు చేస్తున్నారని జగన్ ఆరోపించారు.

ప్రభుత్వం తమ పార్టీ నాయకులను అరెస్టు చేయడానికి, వారిపై పెట్టిన కేసులకు బలం చేకూర్చడానికి సాక్ష్యాలను సృష్టిస్తోందని ఆయన ఆరోపించారు. ఇలా సాక్ష్యాలు క్రియేట్ చేసి, తప్పుడు కేసులు పెట్టాలనుకుంటే ఎవరిపైనైనా కేసులు పెట్టవచ్చని జగన్ చెప్పారు. అయితే, ఇది దుర్మార్గమని, వ్యవస్థను భ్రష్టు పట్టించడమేనని అన్నారు. ఇలాంటి పనుల వల్లే నక్సలిజం పుట్టుకొస్తుందని జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

వైసీపీ నాయకులు, దళిత నేతలు, లాయర్లను కూటమి ప్రభుత్వం వేధిస్తోందని జగన్ మండిపడ్డారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నందిగం సురేశ్, వల్లభనేని వంశీ తదితరులపై ఇప్పటికే తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారని ఆరోపించారు. మచ్చలేని ఆఫీసర్లు ఓఎస్డీ కృష్ణమోహన్, ధనుంజయ్ రెడ్డిలనూ కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని జగన్ చెప్పారు.

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని, రామచంద్రారెడ్డిని ఎప్పుడెప్పుడు అరెస్టు చేయాలా అని చూస్తున్నారని తెలిపారు. ఎప్పుడో కాలేజీ రోజుల్లో రామచంద్రారెడ్డి కొట్టాడనే కోపం చంద్రబాబులో ఇంకా ఉందని, ఆ కోపంతోనే రామచంద్రారెడ్డిని వేధించేందుకు కుట్రలు చేస్తున్నారని జగన్ ఆరోపించారు. పేర్ని నాని, కొడాలి నాని, సజ్జల రామకృష్ణారెడ్డిలతో పాటు వారి కుటుంబాలను కూడా కూటమి ప్రభుత్వం వేధిస్తోందని జగన్ ఆరోపించారు.
Jagan
YS Jagan
Chandrababu Naidu
TDP
YSRCP
Andhra Pradesh Politics
False Cases
AP Politics
Chevi Reddy Bhaskar Reddy
Pinelli Ramakrishna Reddy

More Telugu News