Ben Stokes: మాకు బుమ్రా భయం లేదు.. అతనొక్కడే సిరీస్ గెలిపించలేడు: బెన్ స్టోక్స్

Ben Stokes Says Not Afraid of Bumrah Ahead of India England Test Series
  • భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆసక్తికర వ్యాఖ్యలు
  • టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అంటే తమకు భయం లేదన్న స్టోక్స్
  • ఏ ఒక్క బౌలర్ మాత్రమే సిరీస్‌ను గెలిపించలేడని వ్యాఖ్య
  • 2007 తర్వాత ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ విజయం కోసం భారత్ ఎదురుచూపు
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య రేపటి నుంచి లీడ్స్ వేదికగా ప్రారంభం కానున్న ఐదు టెస్టుల సిరీస్‌కు ముందు మాటల యుద్ధం మొదలైంది. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బుమ్రా బౌలింగ్ తమకు ఎలాంటి భయాందోళనలు కలిగించడం లేదని స్పష్టం చేశాడు. 

స్టోక్స్ మాట్లాడుతూ.. "మాకు ఎలాంటి భయం లేదు. అంతర్జాతీయ క్రికెట్‌లో మీరు నిరంతరం నాణ్యమైన ప్రత్యర్థులను ఎదుర్కోవలసి ఉంటుంది. అతని (బుమ్రా) సత్తా ఏంటో, అతను ఏ జట్టుకు ఆడినా ఎలాంటి బలాన్ని చేకూరుస్తాడో మాకు తెలుసు. కానీ, ఏ ఒక్క బౌలర్ మాత్రమే ఇరు జట్లలో దేనికైనా సిరీస్‌ను గెలిపిస్తాడని నేను అనుకోను. మొత్తం 11 మంది ఆటగాళ్లు రాణించాల్సి ఉంటుంది. ఇరు జట్లలోనూ విజయంలో కీలక పాత్ర పోషించేది ఒక్కరే ఉంటారని నేను భావించడం లేదు" అని అన్నాడు.

కాగా, బుమ్రా 2024 టెస్ట్ సీజన్‌లో అద్భుతంగా రాణించాడు. 13 మ్యాచ్‌లలో 14.92 సగటుతో 71 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఐదుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి. అటు ఇంగ్లండ్‌లో టెస్టుల్లోనూ బుమ్రాకు మంచి రికార్డు ఉంది. అక్కడ ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో 26.27 సగటుతో 37 వికెట్లు తీశాడు. ఇంగ్లండ్‌పై అతని మొత్తం టెస్ట్ గణాంకాలు ఇంకా మెరుగ్గా ఉన్నాయి. 14 మ్యాచ్‌లలో 22.16 సగటుతో 60 వికెట్లు పడగొట్టాడు.

మూడు టెస్టులే ఆడతా: బుమ్రా
ఇదిలాఉంటే.. తన పనిభారం నిర్వహణలో భాగంగా ఇంగ్లండ్ సిరీస్‌లోని ఐదు టెస్టుల్లో మూడింటిలో మాత్రమే ఆడతానని జస్‌ప్రీత్ బుమ్రా ఇటీవల తెలిపాడు. 31 ఏళ్ల బుమ్రా తన కెరీర్‌లో వెన్నునొప్పితో పలుమార్లు సుదీర్ఘకాలం ఆటకు దూరమయ్యాడు.

ఇంగ్లండ్ సిరీస్‌లో తన భాగస్వామ్యం గురించి స్కై క్రికెట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బుమ్రా మాట్లాడుతూ... "పరిస్థితిని బట్టి ప్లాన్ చేసుకుంటాం. నేను మూడు టెస్ట్ మ్యాచ్‌లనే దృష్టిలో పెట్టుకున్నాను. ఆ సంఖ్య ఇంకా ఖరారు కాలేదు. మొదటి టెస్టు కచ్చితంగా ఆడతాను. అది జరుగుతుంది. మిగిలినవి పరిస్థితులు, పనిభారం త‌దిత‌ర విష‌యాల‌ను బట్టి చూస్తాం. ఈ సమయంలో నేను మూడు టెస్ట్ మ్యాచ్‌లు ఆడగలను. నేను నిస్సహాయ స్థితిలో ఉండాలనుకోవడం లేదు" అని తెలిపాడు.

ఇక‌, 2007లో రాహుల్ ద్రవిడ్ నాయకత్వంలో 1-0 తేడాతో సిరీస్ గెలిచిన తర్వాత ఇంగ్లండ్ గ‌డ్డ‌పై టెస్ట్ సిరీస్ విజయం కోసం భారత జట్టు ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ ఇరు జట్లకు ఎంతో కీలకం.
Ben Stokes
Jasprit Bumrah
India vs England
Test Series
England Cricket
Indian Cricket Team
Cricket News
Leeds Test
Rahul Dravid
Test Match

More Telugu News