Sekhar Kammula: కుబేర... సరస్వతీదేవి తలెత్తుకు చూసే సినిమా అంటున్న శేఖర్ కమ్ముల!

Kubera Will Make Saraswati Devi Look Up Says Sekhar Kammula
  • ధనుష్, నాగార్జున, రష్మికలతో శేఖర్ కమ్ముల భారీ చిత్రం 'కుబేర'
  • ధనిక, పేద వర్గాల మధ్య సంఘర్షణే సినిమా ఇతివృత్తం
  • కథ డిమాండ్ వల్లే భారీ బడ్జెట్, మూడు గంటల నిడివి
  • సినిమా చూశాక ప్రేక్షకులు కొత్త అనుభూతి చెందుతారని కమ్ముల ధీమా
  • సరస్వతీ దేవి తలెత్తుకు చూసే సినిమా తీశాననడం గర్వంగా ఉందన్న కమ్ముల
సరళమైన కథలతో, సున్నితమైన భావోద్వేగాలను తెరపై ఆవిష్కరించి తెలుగు ప్రేక్షకులలో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల. 'ఆనంద్', 'గోదావరి', 'ఫిదా' వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత, ఆయన ఇప్పుడు ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న వంటి భారీ తారాగణంతో 'కుబేర' అనే విభిన్నమైన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. సుమారు 150 కోట్ల భారీ బడ్జెట్‌తో, 150 రోజుల పాటు చిత్రీకరించిన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా, శేఖర్ కమ్ముల పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

'కుబేర' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో "సరస్వతీ దేవి తలెత్తుకుని చూసేలా ఈ సినిమా ఉంటుంది" అని తాను చేసిన వ్యాఖ్యలపై కమ్ముల స్పందిస్తూ, "సుమారు 25 ఏళ్ల నా ప్రయాణంలో, కంటెంట్ పరంగా ఎంతో గర్వంగా, సంతోషంగా చెప్పిన మాట అది. మనం పట్టించుకోని, మనకు తెలియని ఓ గొప్ప ప్రపంచాన్ని, అలాగే అత్యంత పేద ప్రపంచాన్ని చూపించగలుగుతున్నాననే సంతృప్తితో ఆ మాట అన్నాను. ఎవరూ ధైర్యం చేయని కథను చెప్పగలిగానన్న సార్థకత ఉంది" అని వివరించారు. తన అన్ని సినిమాల కంటే ఇదే గొప్పదని కాకపోయినా, ఒక ప్రత్యేకమైన ప్రయత్నంగా దీన్ని భావిస్తున్నానని ఆయన తెలిపారు.

తన సినిమాల్లో 'సిగ్నేచర్' గురించి ప్రస్తావిస్తూ, అది కేవలం అందమైన ప్రేమకథలు తీయడం కాదని, ఏ కథ చెప్పినా దానిని నిజాయతీగా, బాధ్యతతో చెప్పడమే తన మార్క్ అని శేఖర్ కమ్ముల స్పష్టం చేశారు. "‘లీడర్’ సినిమాలో రాజకీయ నేపథ్యాన్ని వాస్తవికంగా చూపించాను. 'కుబేర'లో కూడా పాత్రలు, లొకేషన్లు, కథాంశం అన్నీ వాస్తవికతకు దగ్గరగా ఉంటాయి. పాత్రల పరంగా నిజాయతీగా ఉండటమే నా సిగ్నేచర్" అని ఆయన అన్నారు. ఫిల్మ్‌మేకర్‌గా పరిణామం చెందుతూ, చుట్టూ ఉన్న ప్రపంచానికి ప్రభావితమవుతూ కథలు ఎంచుకుంటానని తెలిపారు.

ధనుష్, నాగార్జున వంటి స్టార్లను ఎంచుకోవడం వెనుక మార్కెట్ విస్తరణ ఆలోచనలు లేవని కమ్ముల తెలిపారు. "సినిమా చూశాక ధనుష్ తప్ప ఆ పాత్రను ఇంకెవరూ చేయలేరని మీకే అనిపిస్తుంది. నాగార్జున గారి నటన కూడా అద్భుతంగా ఉంటుంది" అని పేర్కొన్నారు. ముంబై నేపథ్యంలో సాగే కథ కావడంతో కొందరు హిందీ నటీనటులను తీసుకున్నామని, మిగతాదంతా పాత్రల డిమాండ్ ప్రకారమే జరిగిందని వివరించారు. రష్మిక మందన్న ఎంపిక గురించి మాట్లాడుతూ, ఆమె కమర్షియల్ స్టార్ అయినా, నటిగా ప్రతిభావంతురాలని, పాత్రకు కావాల్సిన అమాయకత్వం, చిలిపితనం ఆమెలో కనిపించాయని ప్రశంసించారు.

ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. థ్రిల్లర్‌తో పాటు ఎమోషనల్ కంటెంట్ ఉన్న ఈ సినిమాకు దేవి శ్రీ కమర్షియల్ ఎడ్జ్ ఇచ్చారని కమ్ముల తెలిపారు. సినిమా నిడివి సుమారు మూడు గంటలు ఉండటంపై, "కథలో అంత విషయం ఉంది. రెండు విభిన్న ప్రపంచాలు, ఎంతో మంది పాత్రలు, వారి కథలు చెప్పడానికి అంత సమయం అవసరమైంది. అనవసరంగా ఒక్క సన్నివేశం కూడా ఉండదు" అని వివరించారు. భారీ బడ్జెట్, ఎక్కువ రోజుల షూటింగ్ కూడా కథ డిమాండ్ చేసిందేనని,  కొన్నిసార్లు భయపడినా కథ కోసమే ఈ సినిమా చేశానని అన్నారు.

"ఒకప్పుడు నా సినిమా విడుదల చేయడానికి థియేటర్లకు డబ్బులిచ్చి స్టార్ట్ చేశాను. ఇప్పుడు నా సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇది కచ్చితంగా పెద్ద బాధ్యత. విడుదల ముందు భయమే ఎక్కువగా ఉంటుంది" అని శేఖర్ కమ్ముల తన మనసులోని మాటను పంచుకున్నారు. 'కుబేర' తన కెరీర్‌లో ఓ ముఖ్యమైన చిత్రమని, ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సుమారు మూడేళ్ల పాటు శ్రమించి, తోట తరణి ఆర్ట్ వర్క్, అద్భుతమైన సినిమాటోగ్రఫీతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దినట్లు తెలిపారు.
Sekhar Kammula
Kubera Movie
Dhanush
Nagarjuna Akkineni
Rashmika Mandanna
Telugu Cinema
Tollywood
Devi Sri Prasad
Kubera Film
Telugu Movies 2024

More Telugu News