Chandrababu Naidu: ఒకప్పుడు గ్రామదేవతలకు పొట్టేళ్లు బలిచ్చేటప్పుడు 'రప్పా రప్పా' అనే వారు: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Slams Jagans Palnadu Visit
  • నిన్న సత్తెనపల్లిలో జగన్ పర్యటన
  • సీఎం చంద్రబాబు ఫైర్
  • ఇరుకు సందుల్లో సభలు పెట్టి హింసను ప్రేరేపించారన్న చంద్రబాబు
  • గంజాయి, బెట్టింగ్, రౌడీ మూకలకు విగ్రహాలు ఏర్పాటు చేస్తారా అని ప్రశ్న
వైసీపీ అధినేత జగన్ పల్నాడు పర్యటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పర్యటన సందర్భంగా జగన్ అనుమతులను ఉల్లంఘించారని, హింసను ప్రోత్సహించేలా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. ఇవాళ అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ, వైసీపీ నేతల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

"పల్నాడు పర్యటనలో భాగంగా ఇరుకైన సందుల్లో సమావేశాలు నిర్వహించారు. హింసను ప్రేరేపించడమే కాకుండా, పోలీసులపైనే నిందలు మోపారు. రాష్ట్రంలో ఇటువంటి పోకడలు ఎప్పుడైనా చూశామా?" అని చంద్రబాబు ప్రశ్నించారు. "చంపండి... నరకండి అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆనందిస్తున్నారు. సమాజంలో ఇలాంటి ధోరణులు చాలా ప్రమాదకరం" అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గంజాయి, బెట్టింగ్ బ్యాచ్‌లు, రౌడీలకు విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారని, ఇది సమాజానికి ఎంతమాత్రం మంచిది కాదని హితవు పలికారు. "భవిష్యత్తును తీర్చిదిద్దే నాయకుల గురించి ప్రజలు ఆలోచించాలి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాలపై కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. మీరు మారాలి, లేకపోతే ప్రజలే మిమ్మల్ని మారుస్తారు. మారితే సమాజం అంగీకరిస్తుంది. తప్పుడు పనులతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తామంటే కుదరదు" అని చంద్రబాబు స్పష్టం చేశారు. "రాజకీయం చేస్తే వదిలిపెట్టను, తాట తీస్తా" అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు.

ఏడాది క్రితం మరణించిన నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని ఇప్పుడు పరామర్శించడాన్ని కూడా చంద్రబాబు తప్పుబట్టారు. "వైసీపీ ప్రభుత్వ హయాంలోనే నాగమల్లేశ్వరరావు చనిపోయారు. అప్పుడు అధికారంలో ఉన్నది వాళ్లే. కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందే ఆ వ్యక్తి మరణించారు. కానీ, ఇప్పుడు పరామర్శిస్తారా?" అని నిలదీశారు. రౌడీయిజం చేయాలంటూ అందరికీ మార్గదర్శనం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

నిన్న సత్తెనపల్లిలో జగన్ పర్యటన సందర్భంగా జరిగిన ఘటనలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. "ఒకవైపు యోగా దినోత్సవం జరుగుతుంటే, మరోవైపు 'రప్పా రప్పా' అంటూ నినాదాలు చేస్తున్నారు. ఒకప్పుడు గ్రామ దేవతలకు పొట్టేళ్లను బలి ఇచ్చేటప్పుడు 'రప్పా రప్పా' అనేవారు. ఇప్పుడు ఎవరిని నరుకుతారు? ప్రజలనా?" అంటూ పరోక్షంగా సత్తెనపల్లి ఘటనలపై ఆయన మండిపడ్డారు. 

"చట్టాన్ని ఉల్లంఘించేవాళ్లను ఏమనాలి? నేరస్తులతో కలిసి రాజకీయాలు చేయాల్సిన దుస్థితి వచ్చింది. ఇష్టానుసారంగా టెర్రరిజం సృష్టిస్తే చూస్తూ ఊరుకోం" అని చంద్రబాబు స్పష్టం చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఎవరినీ ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకోవడం లేదని ఆయన తెలిపారు.
Chandrababu Naidu
Jagan Mohan Reddy
YCP
Andhra Pradesh Politics
Palnadu
Sattenthapalli
Political Violence
Telugu Desam Party
Law and Order
AP CM

More Telugu News