Air India: అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

Air India Ahmedabad Plane Crash Central Government Key Announcement
  • అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై కేంద్రం ప్రకటన
  • ఏఏఐబీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ నిపుణులతో దర్యాప్తు ముమ్మరం
  • 30 రోజుల్లో ప్రాథమిక, ఏడాదిలో తుది నివేదిక సమర్పణ
అహ్మదాబాద్‌లో ఇటీవల జరిగిన ఘోర ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. జూన్ 12న సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ కు బయలుదేరిన బోయింగ్ విమానం టేకాఫ్ అయిన క్షణాల వ్యవధిలోనే మేఘనీ నగర్‌లోని సివిల్ హాస్పిటల్ క్యాంపస్‌పై కుప్పకూలింది. ఈ దురదృష్టకర ఘటనలో పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించిన సంగతి తెలిసిందే.

ఈ ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) నేతృత్వంలో సమగ్ర విచారణ జరుగుతోందని పౌర విమానయాన శాఖ తెలిపింది. యూఎన్ ఐసీఏఓ (అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ) నిబంధనలకు అనుగుణంగా ఈ దర్యాప్తు సాగుతోంది. ఇందులో అమెరికా, యూకే దేశాలకు చెందిన నిపుణులతో పాటు బోయింగ్, జనరల్ ఎలక్ట్రిక్, ఎయిర్ ఇండియా ప్రతినిధులు, భారతీయ నియంత్రణ సంస్థల అధికారులు పాలుపంచుకుంటున్నారు.

విమానంలో ఇంజన్ వైఫల్యం, ఫ్లాప్‌లు, లాండింగ్ గియర్ సమస్యలు, ఎలక్ట్రానిక్ లోపాలు, ఇంధన కాలుష్యం వంటి అనేక అంశాలపై దర్యాప్తు బృందం దృష్టి సారించింది. ఘటనా స్థలంలో లభ్యమైన విమాన శకలాలు, సీసీటీవీ ఫుటేజీ, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, పైలట్ల శిక్షణ రికార్డులు, విమానం బరువు, ఇంజన్ థరస్ట్, ఏసీఏఆర్ఎస్ (ఎయిర్‌క్రాఫ్ట్ కమ్యూనికేషన్స్ అడ్రసింగ్ అండ్ రిపోర్టింగ్ సిస్టమ్) డేటాను క్షుణ్ణంగా విశ్లేషిస్తున్నారు. ఐసీఏఓ మార్గదర్శకాల ప్రకారం, ప్రాథమిక నివేదికను 30 రోజుల్లోగా, పూర్తిస్థాయి నివేదికను 12 నెలల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. బ్లాక్‌బాక్స్ డీకోడింగ్‌కు సంబంధించిన నిర్ణయాన్ని సాంకేతిక ఆధారాల మేరకే ఏఏఐబీ తీసుకుంటుందని, మీడియాలో వస్తున్న ఊహాగానాలను నమ్మవద్దని పౌర విమానయాన శాఖ స్పష్టం చేసింది.

మరోవైపు, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కూడా చర్యలు చేపట్టింది. ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787-8, 787-9 రకం విమానాల్లో 34 విమానాలకు గాను ఇప్పటికే 24 విమానాల్లో తనిఖీలు పూర్తి చేసినట్లు డీజీసీఏ తెలిపింది. ఈ తనిఖీల్లో ఇప్పటివరకు ఎటువంటి తీవ్రమైన లోపాలు కనబడలేదని అధికారులు పేర్కొన్నారు. 
Air India
Ahmedabad plane crash
plane crash
AAIB investigation
DGCA
Boeing 787
Sardar Vallabhbhai Patel International Airport
aircraft accident investigation
civil aviation
ICAO

More Telugu News