Hyderabad: పెళ్లయిన ఆరునెలలకే విషాదం.. కట్నం వేధింపులతో దుర్గం చెరువులో దూకి టెకీ ఆత్మహత్య

Hyderabad Software Engineer Sushma Suicide at Durgam Cheruvu
  • ఆరు నెలల క్రితమే వివాహమైన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
  • అదనపు కట్నం కోసం అత్తింటి వేధింపులు
  • దుర్గం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న సుష్మ
  • మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు
  • భర్త, అత్తమామలు, మరిదిపై కేసు నమోదు
హైద‌రాబాద్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. పెళ్లయి ఆరు నెలలు కూడా గడవక ముందే ఓ నవ వధువు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తనువు చాలించింది. అదనపు కట్నం కోసం అత్తింటివారు పెడుతున్న వేధింపులు భరించలేక, తీవ్ర మనస్తాపంతో దుర్గం చెరువులోని తీగల వంతెన పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

పూర్తి వివరాల్లోకి వెళితే… ఈస్ట్‌మారేడ్‌పల్లి, అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన అంజయ్య, సుశీల దంపతుల కుమార్తె సుష్మ (27). ఈమె సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. సుష్మకు నేరేడ్‌మెట్‌కు చెందిన గొల్లూరు ఆనంద్, పాలిన దంపతుల కుమారుడు అమృత్‌తో ఈ ఏడాది జనవరి 31న వివాహం జరిపించారు. అమృత్ కూడా సాఫ్ట్‌వేర్ ఇంజనీరే. వివాహ సమయంలో సుష్మ తల్లిదండ్రులు రూ.5 లక్షల నగదు, 6 తులాల బంగారం, ఒక రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను కట్నంగా ఇచ్చినట్లు తెలిపారు.

వివాహం జరిగిన కొన్నాళ్లకే అదనపు కట్నం తేవాలంటూ సుష్మను ఆమె భర్త అమృత్, అత్త పాలిన, మామ ఆనంద్, మరిది కలిసి వేధించడం మొదలుపెట్టారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. అనారోగ్యంతో బాధపడుతున్న సుష్మను ఈ నెల 13న ఆసుపత్రిలో చేర్పించగా, 16న డిశ్చార్జ్ అయింది. అనంతరం ఆమెను తల్లిదండ్రులు తమ ఇంటికి తీసుకెళ్లారు.

మరుసటి రోజైన 17వ తేదీన తన ల్యాప్‌టాప్ తెచ్చుకోవడానికి సుష్మ తండ్రి అంజయ్యతో కలిసి అత్తగారింటికి వెళ్లింది. అక్కడ మళ్లీ ఎందుకు వచ్చావ్ అంటూ భర్త, అత్తమామలు సుష్మను సూటిపోటి మాటలతో వేధించారని, అదనపు కట్నం తీసుకురావాలంటూ తండ్రి అంజయ్యను కూడా దూషించారని తెలిసింది. దీంతో సుష్మ తీవ్ర మనస్తాపానికి గురైంది.

బుధవారం మధ్యాహ్నం సుష్మ ఆఫీసుకు వెళ్లింది. రాత్రి ఒంటి గంట‌యినా ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తండ్రి అంజయ్య, ఆమె పనిచేస్తున్న కంపెనీ మేనేజర్‌కు ఫోన్ చేశారు. సుష్మ రాత్రి 8:30 గంటల సమయంలోనే ఆఫీసు నుంచి వెళ్లిపోయిందని మేనేజర్ తెలిపారు. దీంతో కంగారుపడిన తల్లిదండ్రులు తెలిసినచోట్లల్లా వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో నిన్న‌ తెల్లవారుజామున 4 గంటలకు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం ఉదయం 7:30 గంటల సమయంలో దుర్గం చెరువులో ఓ మహిళ మృతదేహం తేలుతుందని స్థానికుల నుంచి పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహాన్ని పరిశీలించి అది సుష్మదేనని గుర్తించారు.

మాదాపూర్ ఇన్‌స్పెక్టర్ కృష్ణమోహన్ తెలిపిన వివరాల ప్రకారం, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సుష్మ భర్త అమృత్, అత్త పాలిన, మామ ఆనంద్, మరిదిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో సుష్మ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Hyderabad
Sushma
Software Engineer
Durgam Cheruvu
Dowry Harassment
Suicide
Madhapur Police
Telangana
Techie Suicide
Domestic Violence

More Telugu News