Salman Khan: ఆమిర్ ఖాన్ సినిమా నేను చేయాల్సింది... ఏం జరిగిందో చెబుతా: సల్మాన్ ఖాన్

Salman Khan Jokes About Missing Out on Aamir Khans Sitaare Zameen Par
  • ముంబైలో ఘనంగా జరిగిన ఆమిర్ ఖాన్ 'సితారే జమీన్ పర్' సినిమా ప్రీమియర్ 
  • హాజరైన షారుఖ్, సల్మాన్, రేఖ, విక్కీ కౌశల్ తదితరులు
  • ఈ సినిమా కథను ఆమిర్ తొలుత తనకే చెప్పాడన్న సల్మాన్
బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ నటించిన తాజా చిత్రం 'సితారే జమీన్ పర్'. ఈ స్పోర్ట్స్ డ్రామా సినిమాకు ఆర్.ఎస్. ప్రసన్న దర్శకత్వం వహించగా, ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. గురువారం సాయంత్రం ముంబైలో ఈ సినిమా ప్రీమియర్ షోను సినీ ప్రముఖుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, కండల వీరుడు సల్మాన్ ఖాన్, అలనాటి అందాల తార రేఖ, యువ నటుడు విక్కీ కౌశల్ సహా పలువురు తారలు హాజరై సందడి చేశారు.

ఈ వేడుకలో ఆమిర్ ఖాన్ తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌తో కలిసి పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీరిద్దరూ నవ్వులు చిందిస్తూ ఫొటోగ్రాఫర్లకు పోజులిచ్చారు. సినిమా వీక్షించిన అనంతరం ప్రముఖులు చిత్ర యూనిట్‌తో తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న సల్మాన్ ఖాన్, తన మిత్రుడు ఆమిర్ ఖాన్‌పై సరదాగా జోకులు వేశారు. 'సితారే జమీన్ పర్' సినిమా కథ గురించి మాట్లాడుతూ, "ఈ సినిమా తెరకెక్కించడానికి ముందు జరిగిన కథ మీకెవరికీ తెలియదు. ఈరోజు ఆ రహస్యం మీతో పంచుకుంటా. ఓసారి ఆమిర్ నన్ను ఇంటికి పిలిచి ఈ కథ చెప్పాడు. కథ నాకు బాగా నచ్చింది. తప్పకుండా చేస్తానని మాటిచ్చాను. కానీ కొన్ని రోజుల తర్వాత ఆమిర్ ఫోన్ చేసి, తనే ఈ సినిమా చేస్తున్నానని చెప్పాడు. దానికి నేను సంతోషించాను, అతని నిర్ణయాన్ని అభినందించాను" అంటూ చమత్కరించారు.

కాగా, ఆమిర్ ఖాన్ తన 60వ జన్మదినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గౌరీ స్ప్రాట్‌తో తనకున్న సంబంధాన్ని అధికారికంగా వెల్లడించారు. తాను ఏడాదిన్నర కాలంగా ఆమెతో డేటింగ్ చేస్తున్నట్లు తెలిపారు. గౌరీ గత కొంతకాలంగా ఆమిర్ ఖాన్ నిర్మాణ సంస్థలో సహాయకురాలిగా పనిచేస్తున్నారు. వీరిద్దరి మధ్య దాదాపు 25 ఏళ్ల స్నేహబంధం ఉందని సమాచారం.
Salman Khan
Aamir Khan
Sitaare Zameen Par
Gauri Spratt
Bollywood
Movie Premiere
Shah Rukh Khan
Vicky Kaushal
RS Prasanna

More Telugu News