Gorantla Butchaiah Choudary: జగన్ కు మతిభ్రమించింది... ఎర్రగడ్డలో చేర్పించాలేమో!: బుచ్చయ్య చౌదరి

Gorantla Butchaiah Choudary Criticizes Jagan Reddy Calls for Mental Treatment
  • మాజీ సీఎం జగన్‌పై ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రస్థాయిలో ధ్వజం
  • ప్రజాతీర్పుతో జగన్‌కు మతిభ్రమించిందని, పిచ్చిగా మాట్లాడుతున్నారని విమర్శ
  • రాష్ట్రంలో అశాంతి సృష్టించేందుకు జగన్ కుట్ర పన్నుతున్నారని ఆరోపణ
  • చంద్రబాబు పాలన ప్రజాస్వామ్యబద్ధంగా సాగుతోందని వెల్లడి
  • జగన్ తన పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిక
వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం నాడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జగన్ రెడ్డి ఎన్నికల్లో ఓటమి తర్వాత మతి భ్రమించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 

"ఖబడ్దార్ జగన్ రెడ్డీ... పొట్టేలు తలలు నరికినట్లు ఎవరి తలలు నరుకుతావు?" అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ప్రజలిచ్చిన తీర్పుతో మతి భ్రమించి ప్యాలెస్‌లో టీవీలు పగలగొట్టుకుంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడతారా?" అంటూ తీవ్ర స్వరంతో ప్రశ్నించారు.

గత ఐదేళ్లు నియంతలా పరిపాలించిన జగన్ రెడ్డి, ఓటమి తర్వాత కూడా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నారని గోరంట్ల ఆరోపించారు. "అధికారం కోల్పోవడంతో జగన్‌కు మతి భ్రమించినట్లుంది. ఎర్రగడ్డలోనో, విశాఖ మానసిక ఆస్పత్రిలోనో చికిత్స చేయించాల్సి ఉంది," అని ఆయన వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి రాకుండా, ప్రజల సమస్యలపై మాట్లాడకుండా కేవలం కుట్ర రాజకీయాలకు తెరలేపి పర్యటనలు చేస్తున్నారని, రౌడీ మూకలను, గంజాయి బ్యాచ్‌లను వెనకేసుకొస్తున్నారని విమర్శించారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడకముందు జరిగిన ఘటనలను ప్రస్తుత ప్రభుత్వానికి అంటగట్టాలని జగన్ ప్రయత్నిస్తున్నారని బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. "మీ పర్యటనలో మీ వాళ్ళే ఇద్దరు చనిపోతే కనీసం పరామర్శించడానికి కూడా వెళ్లలేదు, నువ్వా మాట్లాడేది?" అని నిలదీశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించి, ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలని జగన్ కుట్ర పన్నుతున్నారని ఆయన అన్నారు. తన సొంత బాబాయ్ హత్య కేసును మాఫీ చేయించుకోవడానికి జగన్ పడుతున్న తిప్పలు అందరూ చూస్తున్నారని పేర్కొన్నారు.

గత ఐదేళ్లలో జగన్ రైతులను, యువతను మోసం చేశారని గోరంట్ల విమర్శించారు. "రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వలేదు, కొన్న ధాన్యానికి డబ్బులివ్వలేదు. బడుగు బలహీన వర్గాలకు సంక్షేమం ముసుగులో అప్పులు తెచ్చి దోచుకోవడం తప్ప జగన్ చేసిందేమీ లేదు," అని అన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంతో ముందుకు వెళ్తోందని, తాము చెప్పినవన్నీ అమలు చేస్తున్నామని తెలిపారు. "తల్లికి వందనం ఇచ్చాం, పింఛన్ ఇచ్చాం. రైతులను ఆదుకుంటున్నాం, ధాన్యం కొన్న వెంటనే డబ్బులు ఇస్తున్నాం," అని వివరించారు.

జగన్ రెడ్డి తన కపట నాటకాలు కట్టిపెట్టాలని గోరంట్ల హితవు పలికారు. "చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యబద్ధంగా పాలన సాగిస్తున్నారు కాబట్టే జగన్ బయట తిరుగుతున్నాడు. దీన్ని అలుసుగా తీసుకుంటే జగన్ రెడ్డి రోడ్డెక్కే పరిస్థితి ఉండదు," అని హెచ్చరించారు. "మేము రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన చేస్తున్నాం. మా ఓపిక నశించి మా కార్యకర్తలు తిరగబడితే వైసీపీ మూకల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి," అని అన్నారు. కులాలు, మతాల పేరుతో ప్రజలను రెచ్చగొట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కుదరదని స్పష్టం చేశారు. అరాచకాలు కొనసాగిస్తే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని, అప్పుడు జగన్ బయట తిరగలేరని తేల్చిచెప్పారు.
Gorantla Butchaiah Choudary
Jagan Mohan Reddy
TDP
YSRCP
Andhra Pradesh Politics
Mental Asylum
Corruption
Chandrababu Naidu
Political Criticism
Telugu Desam Party

More Telugu News