Shashi Tharoor: ఉప ఎన్నికల ప్రచారంపై శశిథరూర్ వ్యాఖ్యలు.. స్పందించిన కాంగ్రెస్ పార్టీ

Shashi Tharoor on Bypoll Campaign Congress Party Responds
  • నిలంబూర్ ఉప ఎన్నిక ప్రచారానికి ఆహ్వానించలేదన్న శశిథరూర్
  • థరూర్ ఆరోపణలను ఖండించిన కేరళ కాంగ్రెస్ చీఫ్ సన్నీ జోసఫ్
  • స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో థరూర్ పేరుందని వెల్లడి
  • విదేశీ పర్యటనలో ఉండటం వల్లే రాలేకపోయానన్న థరూర్
కేరళలోని నిలంబూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ప్రచారం కాంగ్రెస్ పార్టీలో కొత్త వివాదానికి దారితీసింది. ఈ ప్రచారానికి తనను పార్టీ ఆహ్వానించలేదని తిరువనంతపురం ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ చేసిన వ్యాఖ్యలపై కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) స్పందించింది.

నిన్న విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, నిలంబూర్ ఉప ఎన్నిక ప్రచారానికి పార్టీ తనను ఆహ్వానించలేదని శశిథరూర్ అన్నారు. ఆ సమయంలో తాను విదేశీ పర్యటనలో ఉన్నానని కూడా ఆయన తెలిపారు. ఈ వ్యాఖ్యలు కేరళ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

శశిథరూర్ ఆరోపణలపై కేరళ కాంగ్రెస్ పార్టీ చీఫ్ సన్నీ జోసఫ్ శుక్రవారం తిరువనంతపురంలో మీడియాతో మాట్లాడారు. నిలంబూర్ ఉప ఎన్నికల ప్రచారం కోసం పార్టీ రూపొందించిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో శశిథరూర్ పేరు ఉందని ఆయన తెలిపారు.

ఈ జాబితాను కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా సమర్పించామని వివరించారు. ఈ విషయంపై ఇంతకంటే ఎక్కువగా తాను వ్యాఖ్యానించలేనని సన్నీ జోసఫ్ పేర్కొన్నారు. అయితే, ఈ ఉప ఎన్నికల ప్రచారంలో కేంద్ర మాజీ మంత్రి ఏకే ఆంటోని మినహా మిగిలిన నేతలందరూ చురుగ్గా పాల్గొని, పార్టీ అభ్యర్థి అర్యాదన్ షౌకత్‌కు మద్దతుగా ప్రచారం చేశారని ఆయన గుర్తుచేశారు. రమేశ్ చెన్నితల, కె. సురేశ్ వంటి నేతలు ప్రచారంలో పాల్గొన్నారని తెలిపారు.

నాలుగు రాష్ట్రాల్లోని ఐదు అసెంబ్లీ స్థానాలకు జూన్ 19న ఉప ఎన్నికలు జరిగాయి. అందులో కేరళలోని నిలంబూర్ స్థానం కూడా ఉంది. ఈ ఉప ఎన్నికల ఫలితాలు జూన్ 23న వెలువడనున్నాయి. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ పార్టీలోని కొందరు అగ్రనేతలతో తనకు కొంత దూరం పెరిగిన మాట వాస్తవమేనని ఇటీవల శశిథరూర్ స్వయంగా అంగీకరించారు.
Shashi Tharoor
Kerala
Nilambur byelection
Congress party
Sunny Joseph
AK Antony

More Telugu News