J-35 Fighter Jet: పాకిస్థాన్‌కు చైనా స్టెల్త్ యుద్ధ విమానాలు... భారత్‌కు పెను సవాల్!

J35 Fighter Jet Chinas Stealth Aircraft a Challenge for India
  • పాకిస్థాన్‌కు చైనా జే-35 స్టెల్త్ ఫైటర్ జెట్లు
  • 40 విమానాలు కొనుగోలు చేస్తున్న పాక్
  • ఈ ఏడాదే తొలి విడత అందే అవకాశం
  • భారత్‌ వద్ద ప్రస్తుతం స్టెల్త్ యుద్ధ విమానాలు లేవు
  • స్వదేశీ ఏఎంసీఏ యుద్ధ విమానం తయారీకి మరో పదేళ్లు
  • గగనతలంలో శక్తి సమతుల్యతపై ప్రభావం చూపే అవకాశం
భారత పొరుగుదేశం పాకిస్థాన్ తన వాయుసేన పాటవాన్ని గణనీయంగా పెంచుకునే దిశగా కీలక అడుగు వేస్తోంది. చైనా నుంచి అత్యాధునిక జే-35 (ఎఫ్‌సీ-31) స్టెల్త్ యుద్ధ విమానాలను సమకూర్చుకోనుండటం ఇప్పుడు భారత రక్షణ రంగానికి సవాల్ గా పరిణమించనుంది. ఈ ఏడాది చివరి నాటికే తొలి విడత విమానాలు పాక్‌కు అందే అవకాశముందని నివేదికలు వెలువడుతుండటంతో, దక్షిణ ఆసియా గగనతలంలో శక్తి సమతుల్యతపై దీని ప్రభావంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

చైనా ప్రభుత్వ మీడియా కథనాల ప్రకారం, జే-35 విమానం రెండు ఇంజన్లు కలిగిన ఐదో తరం స్టెల్త్ ఫైటర్. ఇది అత్యాధునిక ఏవియానిక్స్, యాక్టివ్ ఎలక్ట్రానికల్లీ స్కాన్డ్ అర్రే (ఏఈఎస్ఏ) రాడార్, ఎలక్ట్రో-ఆప్టికల్ టార్గెటింగ్ సిస్టమ్ (ఈఓటీఎస్), ఇన్‌ఫ్రారెడ్ సెర్చ్ అండ్ ట్రాక్ (ఐఆర్‌ఎస్‌టీ) వంటి వ్యవస్థలతో కూడి ఉంది. ఇది అమెరికాకు చెందిన ఎఫ్-35 యుద్ధ విమానంతో పోల్చదగినదని, గగనతలంలో ఆధిపత్యం చెలాయించగలదని చైనా పేర్కొంటోంది. పాకిస్థాన్ సుమారు 40 జే-35 విమానాలను కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పాక్ వాయుసేనలో చైనా నిర్మిత జే-10సీ, జేఎఫ్-17 విమానాలున్నాయి.

భారత్‌కు ప్రధాన ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ప్రస్తుతం మన వాయుసేన వద్ద స్టెల్త్ యుద్ధ విమానాలు లేవు. దేశీయంగా అభివృద్ధి చేస్తున్న ఐదో తరం అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఏఎంసీఏ) ప్రాజెక్టు పూర్తయి, విమానాలు వాయుసేనలోకి చేరడానికి మరో దశాబ్దం (సుమారు 2035 వరకు) పట్టొచ్చు. ఈ మధ్యకాలంలో పాకిస్థాన్ స్టెల్త్ సామర్థ్యాన్ని సంతరించుకోవడం, భారత వాయుసేన సాంకేతిక ఆధిక్యానికి సవాల్ విసురుతుందని నిపుణులు భావిస్తున్నారు. జే-35 రాడార్ క్రాస్-సెక్షన్ (ఆర్‌సీఎస్) చాలా తక్కువగా (0.001 చ.మీ. – ఎఫ్-35తో సమానం) ఉంటుందని అంచనా. దీనివల్ల భారత రాడార్లు ఈ విమానాలను గుర్తించడం కష్టతరమౌతుంది, తద్వారా మన ప్రతిస్పందన సమయం తగ్గిపోతుంది.

ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన రఫేల్ యుద్ధ విమానాలతో భారత్ సాధించిన ఆధిక్యానికి జే-35 రాక గండికొట్టే అవకాశముందని విశ్రాంత ఫైటర్ పైలట్, గ్రూప్ కెప్టెన్ అజయ్ అహ్లావత్ అన్నారు. "ఇది తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. పాకిస్థాన్ చేతికి ఎలాంటి జే-35 వెర్షన్ వెళ్లినా అది మనకు ఆందోళనకరమే. ఏఎంసీఏ ప్రాజెక్టును జాతీయ మిషన్ మోడ్‌లో అత్యంత వేగంగా పూర్తి చేయడమే దీనికి సరైన సమాధానం. అలాగని ఎస్ యూ-57, ఎఫ్-35లు కొనుగోలు చేయాలని చూడడం చెడు ఎంపిక అవుతుంది... భారత్ కు ఏఎంసీఏనే కరెక్ట్" అని ఆయన పేర్కొన్నారు.

చైనా, పాకిస్థాన్లు రెండూ స్టెల్త్ ఫైటర్లను కలిగి ఉండటం, ఒకేసారి రెండు సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తలెత్తితే భారత వాయు రక్షణ వ్యవస్థలపై తీవ్ర ఒత్తిడిని పెంచుతుంది. ఈ నేపథ్యంలో, భారత్ తన ప్రస్తుత వాయు రక్షణ వ్యవస్థలను ఆధునీకరించడం, ఏఎంసీఏ అభివృద్ధిని వేగవంతం చేయడం అత్యవసరమని రక్షణ రంగ నిపుణులు నొక్కిచెబుతున్నారు.
J-35 Fighter Jet
Pakistan Air Force
China
Stealth Aircraft
Advanced Medium Combat Aircraft AMCA
Indian Air Force
Rafael Fighter Jet
Military Technology
Defense
South Asia

More Telugu News