Hari Hara Veera Mallu: 'హ‌రిహ‌ర‌ వీర‌మ‌ల్లు' కొత్త రిలీజ్ డేట్.. ప‌వ‌న్ మూవీ థియేటర్ల‌లో సంద‌డి చేసేది ఎప్పుడంటే..!

Hari Hara Veera Mallu Release on July 24th Starring Pawan Kalyan
  • జులై 24న ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా
  • పలు వాయిదాల తర్వాత చిత్ర బృందం అధికారిక ప్రకటన
  • పవన్ రాజకీయాలతో షూటింగ్ ఆలస్యం, దర్శకుడి మార్పు
  • క్రిష్‌, జ్యోతికృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన మూవీ
  • నిధి అగర్వాల్ కథానాయిక.. కీర‌వాణి సంగీతం
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘హరిహర వీరమల్లు’ పార్ట్ 1 విడుదల తేదీపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఈ సినిమాను జులై 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది. దీంతో అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలికినట్లయింది. వాస్తవానికి ఈ చిత్రం ఈనెల‌ 12న విడుదల కావాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.

‘హరిహర వీరమల్లు: పార్ట్‌ 1- స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌’ పేరుతో రానున్న ఈ సినిమాలో పవన్ కల్యాణ్ మునుపెన్నడూ చూడని శక్తిమంతమైన చారిత్రక యోధుడి పాత్రలో కనిపించనున్నారు. సినిమా ప్రారంభమైనప్పటి నుంచి పలుమార్లు విడుదల వాయిదా పడుతూ వచ్చింది. పవన్ రాజకీయాల్లో బిజీ కావ‌డం, తదితర కారణాల వల్ల సినిమా చిత్రీకరణ ఆలస్యమైంది. మొదట క్రిష్ దర్శకత్వంలో కొంత భాగం చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా బాధ్యతలను ఆ తర్వాత నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ చేపట్టారు.

సినిమా చిత్రీకరణ ఆలస్యం కావడం, సెట్స్ పై ఎక్కువ కాలం ఉండటంతో నిర్మాతపై ఆర్థిక భారం పడిందని భావించిన పవన్, తాను అడ్వాన్స్ గా తీసుకున్న పారితోషికాన్ని పూర్తిగా వెనక్కి ఇచ్చేసినట్లు సమాచారం. అంతేకాకుండా, తన బిజీ షెడ్యూల్ మధ్య కూడా సినిమా కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. రాత్రి 10 గంటలకు డబ్బింగ్ పనులు మొదలుపెట్టి, ఏకధాటిగా నాలుగు గంటల్లో పూర్తి చేశారని చిత్ర వర్గాలు తెలిపాయి. 

ఈ సినిమాలోని ‘అసుర హననం’ పాటలో వచ్చే పోరాట సన్నివేశాలను పవన్ కల్యాణే స్వయంగా డిజైన్ చేశారని దర్శకుడు జ్యోతికృష్ణ గతంలో ఒక సందర్భంలో వెల్లడించారు. ఈ పాత్ర కోసం పవన్ మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు.

ఈ పీరియాడికల్ యాక్షన్ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎంఎం కీర‌వాణి బాణీలు అందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగం విడుదలకు సిద్ధమవడంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి.
Hari Hara Veera Mallu
Pawan Kalyan
Krish
AM Ratnam
Jyothi Krishna
Nidhi Agarwal
Bobby Deol
MM Keeravani
Telugu movie release date
historical action film

More Telugu News