Rajnath Singh: పాకిస్థాన్‌కు మరోమారు వార్నింగ్ ఇచ్చిన రాజ్‌నాథ్ సింగ్

Rajnath Singh Issues Warning to Pakistan Again
  • ఉగ్రవాదంపై భారత్ ఇకపై బాధితురాలిగా ఉండదన్న రక్షణ మంత్రి 
  • ఆపరేషన్ సిందూర్‌కు విరామం మాత్రమే ఇచ్చామన్న రాజ్‌నాథ్
  • ఉధంపూర్‌లో సైనికులతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖాముఖి
ఉగ్రవాదం విషయంలో భారత్ వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చిందని, ఇకపై ఉగ్రవాదానికి భారత్ బాధితురాలిగా మిగిలిపోదని, ఉగ్ర చర్యలకు శక్తియుక్తులతో వ్యూహాత్మకంగా బదులిస్తుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్‌లో నార్తర్న్ కమాండ్ వద్ద సైనికులతో ఆయన ముచ్చటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా ఉగ్రవాదులకు, వారిని ప్రోత్సహిస్తున్న వారికి నవభారతం దృఢంగా, నిశ్చయంగా ఉందని, ఉగ్రవాదానికి బాధితురాలిగా ఉండబోదని, శక్తితో, వ్యూహంతో ప్రతిస్పందిస్తుందని బలమైన సందేశం పంపామని అన్నారు.

పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడంలో సాయుధ బలగాలు, నిఘా సంస్థలు చూపిన కచ్చితత్వం, సమన్వయం, ధైర్యసాహసాలను రాజ్‌నాథ్ సింగ్ ఈ సందర్భంగా ప్రశంసించారు. ఈ అసామాన్యమైన శౌర్యం, అంకితభావం కారణంగానే ఉగ్రవాదంపై భారతదేశ విధానంలో మార్పు వచ్చిందని ఆయన నొక్కిచెప్పారు. ఆపరేషన్ సిందూర్ ఒక సైనిక చర్య మాత్రమే కాదని, సరిహద్దు ఆవల ఉన్న ఉగ్రవాదులకు, వారికి మద్దతు ఇచ్చేవారికి ఒక హెచ్చరిక అని అన్నారు. భారతదేశ ఐక్యత, సమగ్రతకు హాని కలిగిస్తే ఇకపై సహించబోమని, తగిన రీతిలో సమాధానం చెబుతామని స్పష్టం చేశారు. 

అలాగే, అంతర్జాతీయ యోగా దినోత్సవం 2025 సందర్భంగా ఏర్పాటు చేసిన బారాఖానా కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైనికులు తమ శారీరక, మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. సైనికులు బలంగా ఉంటే, మన సరిహద్దులు బలంగా ఉంటాయని, సరిహద్దులు బలంగా ఉన్నప్పుడు, భారతదేశం బలంగా ఉంటుందని పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమంలో భాగంగా ఖుక్రీ నృత్యం, భాంగ్రా, కలరి పట్టు, ఝాంజ్ పటక్ వంటి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నార్తర్న్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మ, ఇతర సీనియర్ భారత ఆర్మీ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Rajnath Singh
Pakistan
India
terrorism
PoK
Jammu Kashmir
Indian Army
Operation Sindoor
Udhampur
defence minister

More Telugu News