Nara Lokesh: ప్రధాని మోదీకి గిన్నిస్ కానుకగా 'యోగాంధ్ర' కార్యక్రమం: మంత్రి లోకేశ్‌

Nara Lokesh Presents YogAndhra Guinness Record to PM Modi
  • విశాఖలో యోగాంధ్ర అద్భుతంగా జరిగిందని మంత్రి లోకేశ్ ఆనందం
  • ప్రజల చైతన్యంతోనే ఈవెంట్ విజయవంతం అయిందన్న లోకేశ్
  • అమరావతే పరిపాలనా రాజధాని, అన్ని ప్రాంతాలకూ అభివృద్ధి
  • విశాఖను దక్షిణ భారత ఐటీ హబ్‌గా తీర్చిదిద్ది 5 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యం
ఏపీ విద్య‌, ఐటీ శాఖ‌ల మంత్రి నారా లోకేశ్ విశాఖపట్నంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమం విజయవంతం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలను ప్రధాని నరేంద్ర మోదీ నెరవేరుస్తున్నారని, దానికి కృతజ్ఞతగా ఆయనకు ఒక గిన్నిస్ రికార్డును కానుకగా అందించాలనే సదుద్దేశంతో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించినట్లు లోకేశ్ తెలిపారు.

"మేము ఊహించిన దానికంటే ఎక్కువ మంది ప్రజలు యోగాంధ్ర కార్యక్రమానికి తరలివచ్చారు. ప్రజలలో వెల్లివిరిసిన చైతన్యం కారణంగానే యోగాంధ్ర ఇంతటి ఘన విజయం సాధించింది. ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపునకు స్పందించి ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు" అని మంత్రి లోకేశ్‌ పేర్కొన్నారు. 

కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో ముగియడానికి పటిష్టమైన ఏర్పాట్లే కారణమని ఆయన అన్నారు. "ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు నాపై మరింత బాధ్యతను పెంచాయి. యోగాంధ్ర కార్యక్రమం కేవలం ఒక ఈవెంట్ కాదు. ఇది యావత్ ఆంధ్రుల విజయం" అని లోకేశ్ తెలిపారు.

రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికల గురించి మాట్లాడుతూ... "పరిపాలన సౌలభ్యం కోసమే అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేశాం. అయితే, అభివృద్ధిని అన్ని ప్రాంతాలకూ వికేంద్రీకరిస్తాం" అని లోకేశ్ స్పష్టం చేశారు. "విశాఖపట్నం నగరాన్ని దక్షిణ భారతదేశంలోనే అత్యున్నతమైన ఐటీ హబ్‌గా తీర్చిదిద్దాలన్నది మా సంకల్పం. దీని ద్వారా విశాఖలో ఐదు లక్షల ఐటీ ఉద్యోగాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం," అని మంత్రి నారా లోకేశ్ వివరించారు.
Nara Lokesh
AP Minister
YogAndhra
Visakhapatnam
Andhra Pradesh
Narendra Modi
Guinness World Record
IT Hub Visakhapatnam
AP Development

More Telugu News