Praneeth Rao: సిట్ విచారణకు హాజరైన ప్రణీత్ రావు

Praneeth Rao Attends SIT Inquiry in Phone Tapping Case
  • ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు మళ్ళీ సిట్ విచారణకు
  • 2023 నవంబర్ 15న 650 ఫోన్ల ట్యాపింగ్‌పై ప్రధానంగా ప్రశ్నలు
  • ప్రభాకర్ రావు భారత్ తిరిగొచ్చాక ప్రణీత్ రావుకు ఇది మూడో విచారణ
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు శనివారం మరోసారి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణకు హాజరయ్యారు. అధికారులు ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసుకుంటున్నారు. ముఖ్యంగా, 2023 నవంబర్ 15వ తేదీన ఒకేరోజు ఏకంగా 650 ఫోన్లను ట్యాప్ చేశారన్న ఆరోపణలపై సిట్ అధికారులు ప్రణీత్ రావును కూలంకషంగా ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, ప్రణీత్ రావు వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావడం ఇది మూడోసారి. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే నెపంతో రాజకీయ నాయకుల ఫోన్ నంబర్లను పంపించి, రివ్యూ కమిటీ నుంచి అనుమతి పొందిన తర్వాతే ఈ ఫోన్లను ట్యాప్ చేసినట్లు సిట్ దర్యాప్తులో గుర్తించింది. ఇదే అంశంపై ప్రభాకర్ రావును కూడా సిట్ అధికారులు ఇప్పటికే పలుమార్లు విచారించారు.

శనివారం ఉదయం సిట్ కార్యాలయానికి చేరుకున్న ప్రణీత్ రావును రాత్రి వరకు విచారించి, ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నారు. ఆయన వ్యక్తిగత బ్యాంకు లావాదేవీల వివరాలతో కూడిన డాక్యుమెంట్లను కూడా తీసుకురావాలని సిట్ అధికారులు ఆదేశించడంతో, వాటిని ఆయన సమర్పించినట్లు తెలిసింది. ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న అధికారులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని, అయితే ఈ వ్యవహారం వెనుక ఆదేశాలు జారీ చేసిన రాజకీయ నాయకులు ఎవరనేది ఇంకా అంతుచిక్కడం లేదని సిట్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రణీత్ రావు విచారణ అనంతరం ఈ కేసులో మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని, మరికొందరికి నోటీసులు జారీ చేసి విచారించనున్నారని తెలుస్తోంది. 
Praneeth Rao
Telangana phone tapping case
SIT investigation
Prabhakar Rao
Phone tapping case
Telangana politics
Special Investigation Team
Political leaders
Bank transactions

More Telugu News