Election Commission of India: సీసీటీవీ ఫుటేజ్ బహిర్గతపరచాలని డిమాండ్.. స్పందించిన ఎన్నికల సంఘం

Election Commission Responds to Demand for CCTV Footage Release
  • మహారాష్ట్ర ఎన్నికల సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌పై ఈసీ స్పందన
  • ఫుటేజ్ బహిర్గతం చట్టవిరుద్ధం, ఓటర్ల గోప్యతకు దెబ్బ అని వ్యాఖ్య
  • వీడియోలు గుర్తింపునకు వీలు కల్పిస్తాయి, ఒత్తిళ్లకు దారితీయొచ్చని ఆందోళన
  • ఫుటేజ్ అంతర్గత పర్యవేక్షణకే, కోర్టు అడిగితేనే ఇస్తామని వెల్లడి
  • 45 రోజుల్లో ఫిర్యాదులు లేకుంటే సిసిటివి డేటా తొలగింపునకు ఈసీ నిర్ణయం
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని బహిర్గతం చేయాలంటూ ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్లపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) స్పందించింది. అటువంటి చర్య చట్టవిరుద్ధమని, ఓటర్ల గోప్యతకు భంగం కలిగించడమే అవుతుందని స్పష్టం చేసింది.

గత ఏడాది మహారాష్ట్రలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, పోలింగ్ సమయంలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు గుప్పించాయి. ఈ క్రమంలోనే, పోలింగ్‌కు సంబంధించిన 45 రోజుల సీసీటీవీ ఫుటేజీని బయటపెట్టాలని డిమాండ్ చేశాయి.

"2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలతో పాటు, మహారాష్ట్ర సహా అన్ని రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు చెందిన ఓటరు జాబితాలను విడుదల చేయాలి. అలాగే, మహారాష్ట్ర ఎన్నికల సీసీటీవీ ఫుటేజీని కూడా ఈసీ బహిర్గతం చేయాలి" అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల డిమాండ్ చేశారు.

ఈ డిమాండ్ల నేపథ్యంలో ఎన్నికల సంఘం తన వైఖరిని స్పష్టం చేసింది. "సీసీటీవీ ఫుటేజీ ద్వారా ఒక సమూహాన్ని లేదా ఓటర్‌ను తేలికగా గుర్తించే అవకాశం ఉంటుంది. దీనిని బహిర్గతం చేస్తే, ఓటు వేసినవారు, వేయనివారు కూడా సామాజిక వ్యతిరేక శక్తుల నుంచి ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంది. ఓటర్లను బెదిరించేందుకూ ఆస్కారం ఉంటుంది. కాబట్టి, ఈ ఫుటేజీని బయటపెట్టడం నిబంధనలకు విరుద్ధం. అలా చేయడం వల్ల చట్టపరమైన సమస్యలు కూడా తలెత్తవచ్చు. ఈ వీడియోలు కేవలం అంతర్గత పర్యవేక్షణ కోసం మాత్రమే ఉద్దేశించినవి. ఎన్నికల వివాదాలకు సంబంధించి ఏదైనా న్యాయస్థానం కోరితే, అప్పుడు మాత్రమే ఆ వివరాలను కోర్టుకు అందజేస్తాం" అని ఎన్నికల సంఘం వివరించింది.

ఇదిలా ఉండగా, ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన సీసీటీవీ, వెబ్‌కాస్టింగ్, వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ డేటాను 45 రోజుల తర్వాత తొలగించవచ్చని ఈసీ ఇటీవల తెలిపింది. ఎన్నికలపై 45 రోజుల్లోగా ఎలాంటి ఫిర్యాదులు గానీ, కోర్టు కేసులు గానీ నమోదు కాకపోతే, ఆ ఫుటేజీలను తొలగించాలని ఆదేశించింది. ఎన్నికల సరళి వీడియోలు దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల ఎన్నికల అధికారులకు సూచనలు జారీ చేసింది.
Election Commission of India
Maharashtra Assembly Elections
CCTV footage
Rahul Gandhi
Voter privacy

More Telugu News