Ranganath: హైడ్రా అంటే కూల్చివేతలు జరిపే సంస్థ కాదు!: కమిషనర్ రంగనాథ్

Ranganath HYDRA is not just a demolition agency
  • సొంతింటి కలను నిజం చేయడంలో బ్యాంకుల పాత్ర చాలా ముఖ్యమని హైడ్రా కమిషనర్
  • ఇంటి రుణాలిచ్చే ముందు బ్యాంకర్లు అన్ని వివరాలు క్షుణ్ణంగా పరిశీలించాలని సూచన
  • హైడ్రా ఏర్పాటయ్యాక నిర్మించిన అక్రమ నిర్మాణాలను కచ్చితంగా తొలగిస్తామని హెచ్చరిక
  • పర్యావరణ హితమైన నగరాభివృద్ధే హైడ్రా ప్రధాన లక్ష్యమని వెల్లడి
  • హైదరాబాద్‌ను వరదల్లేని నగరంగా తీర్చిదిద్దుతామని స్పష్టీకరణ
గత ఏడాది జులై 19న హైడ్రా ఏర్పాటైందని, సంస్థ ఆవిర్భావానికి ముందున్న నివాస ప్రాంతాలు, అనుమతులు పొంది నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల జోలికి వెళ్లబోమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. అయితే, హైడ్రా ఏర్పాటైన తదుపరి చేపట్టిన అక్రమ నిర్మాణాలను మాత్రం కచ్చితంగా తొలగిస్తామని స్పష్టం చేశారు. హైడ్రా అంటే కేవలం కూల్చివేతలు జరిపే సంస్థ కాదని, పర్యావరణ అనుకూలమైన నగరాభివృద్ధికి తోడ్పాటును అందించే ఒక వ్యవస్థగా ప్రజలు గుర్తిస్తున్నారని తెలిపారు. సుస్థిరమైన వ్యాపార వాతావరణానికి హైడ్రా దోహదం చేస్తుందనే విషయాన్ని అందరూ గ్రహిస్తున్నారని అన్నారు.

ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ వాల్యూయర్స్, రిజిస్టర్డ్ వాల్యూయర్స్ ఫౌండేషన్, ఐఓవీ హైదరాబాద్ శాఖ సంయుక్తంగా నిర్వహించిన ‘ట్రాన్స్‌ఫర్‌మేటివ్‌ ఎరాలో వాల్యుయేషన్’ అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, హైదరాబాద్ నగరంలో సొంత ఇంటిని సమకూర్చుకోవాలనే ప్రతి ఒక్కరి ఆకాంక్ష నెరవేరడంలో బ్యాంకులు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు.

గృహ రుణాలు మంజూరు చేసేటప్పుడు బ్యాంకర్లు అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆయన హితవు పలికారు. మోసపూరిత కార్యకలాపాలకు ఆస్కారం లేకుండా ప్రజల సొంతింటి కలను సాకారం చేయడంలో స్థిరాస్తి వ్యాపార సంస్థలతో పాటు, ఆర్థిక సహాయం అందించే సంస్థలు కూడా సమాన బాధ్యత వహించాలని రంగనాథ్ స్పష్టం చేశారు.

కొన్ని సందర్భాల్లో ఒక సర్వే నంబర్‌ను చూపించి, వేరొక ప్రదేశంలో నిర్మాణాలు చేపడుతున్న మోసాల పట్ల బ్యాంకర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ఆర్థిక సంస్థలు, పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థలకు ఆస్తుల విలువలను నిర్ధారించే ప్రక్రియలో పారదర్శకత, విశ్వసనీయత, కచ్చితత్వాన్ని కాపాడటంలో వాల్యుయేషన్ నిపుణుల పాత్ర ఎంతో కీలకమైందని ఆయన అభిప్రాయపడ్డారు.

స్థిరాస్తుల విలువలను అంచనా వేయడంలో కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాంకేతికత ఎంతగానో ఉపయోగపడుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించడం కూడా అంతే ముఖ్యమని రంగనాథ్ నొక్కి చెప్పారు. గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించడం ద్వారా హైదరాబాద్‌ను వరద ముప్పులేని నగరంగా తీర్చిదిద్దడమే హైడ్రా ప్రధాన లక్ష్యమని ఆయన వివరించారు.

ఈ దిశగా, చెరువులు, నాలాలు, పార్కులు, రహదారులపై జరుగుతున్న ఆక్రమణలను నిరోధించి, ప్రజా అవసరాల కోసం కేటాయించిన స్థలాలను పరిరక్షించేందుకు హైడ్రా అధిక ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న వెయ్యికి పైగా చెరువులను పునరుద్ధరించి, పార్కులన్నింటినీ పచ్చదనంతో తీర్చిదిద్దినప్పుడు పర్యావరణ సమతుల్యతను సాధించగలమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Ranganath
HYDRA
Hyderabad
real estate
property valuation
artificial intelligence

More Telugu News