Telangana Government: హైదరాబాద్ మెట్రో ఫేజ్ II-బి ప్రతిపాదనలు కేంద్రానికి సమర్పించిన తెలంగాణ ప్రభుత్వం

Telangana submits proposal for Hyderabad Metro Phase II B to Centre
  • మొత్తం 86.1 కిలోమీటర్ల మేర విస్తరణ, రూ.19,579 కోట్ల అంచనా వ్యయం
  • రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్ట్ నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ వరకు ఒక కారిడార్
  • జేబీఎస్ నుంచి మేడ్చల్, శామీర్‌పేట్‌లకు మరో రెండు మార్గాలు
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్‌గా ప్రాజెక్టు చేపట్టే అవకాశం
  • ఇప్పటికే ఫేజ్ II-ఎ అనుమతుల కోసం కేంద్ర మంత్రిని కోరిన సీఎం రేవంత్
హైదరాబాద్‌లో ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో దశలో భాగంగా ఫేజ్ II-బి విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలను శనివారం కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ మేరకు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ (హెచ్ఏఎంఎల్) ఒక ప్రకటనలో తెలిపింది. అవసరమైన అన్ని పత్రాలు, వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదికలతో (డీపీఆర్‌లు) కూడిన ఈ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఆమోదించింది.

ఫేజ్ II-బి కింద మొత్తం 86.1 కిలోమీటర్ల మేర మూడు కొత్త కారిడార్లను నిర్మించనున్నారు. దీనికి గాను రూ.19,579 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ వరకు 39.6 కిలోమీటర్ల మార్గాన్ని రూ. 7,168 కోట్లతో, జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్) నుంచి మేడ్చల్ వరకు 24.5 కిలోమీటర్ల మార్గాన్ని రూ. 6,946 కోట్లతో, జేబీఎస్ నుంచి శామీర్‌పేట్ వరకు 22 కిలోమీటర్ల మార్గాన్ని రూ. 5,465 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు.

గతంలో సమర్పించిన ఫేజ్ II-ఎ (76.4 కి.మీ. పొడవున ఐదు కారిడార్లు) ప్రాజెక్టు మాదిరిగానే, ఈ ఫేజ్ II-బి ప్రాజెక్టును కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో (జాయింట్ వెంచర్) చేపట్టాలని ప్రతిపాదించారు. కేంద్ర ప్రభుత్వ జాయింట్ వెంచర్ ప్రాజెక్టు నిబంధనల ప్రకారం ఫేజ్ II-బి మొత్తం వ్యయం రూ. 19,579 కోట్లలో తెలంగాణ వాటా 30 శాతం.. అంటే రూ.5,874 కోట్లు, కేంద్రం వాటా రూ.3,524 కోట్లు (18 శాతం) ఉండనుంది. మిగిలిన 48 శాతం నిధులు (రూ.9,398 కోట్లు) అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి రుణాలుగా, మరో 4 శాతం (రూ.783 కోట్లు) పీపీపీ పద్ధతిలో సమీకరించనున్నారు.

ఇదిలా ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే హెచ్ఎంఆర్ ఫేజ్ II-ఎ కు ఆమోదం తెలిపి కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపిన విషయం తెలిసిందే. ఈ ఫేజ్ II-ఎ కింద 76.4 కిలోమీటర్ల మేర ఐదు కారిడార్లను రూ.24,269 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్ 19న ఢిల్లీలో కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో భేటీ అయిన సందర్భంగా, ఫేజ్ II-ఎ ప్రాజెక్టుకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో ప్రజా రవాణా అవసరాలు పెరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో 76.4 కిలోమీటర్ల మేర చేపట్టనున్న హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ II-ఎ ప్రాజెక్టు ప్రాముఖ్యతను కేంద్ర మంత్రికి రేవంత్ రెడ్డి వివరించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రోడ్లపై రద్దీ తగ్గి ప్రయాణం సులభతరం అవుతుందని, సుస్థిర అభివృద్ధికి కూడా దోహదపడుతుందని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వంతో కలిసి జాయింట్ వెంచర్‌గా చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ (జైకా), ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) వంటి సంస్థల నిధులతో పాటు ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో (పీపీపీ) దీనిని చేపట్టనున్నట్టు కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి తెలియజేశారు.

కాగా, హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ I కింద 69.2 కిలోమీటర్ల మేర మూడు కారిడార్లను సుమారు రూ.22,000 కోట్ల వ్యయంతో నిర్మించి, ఇప్పటికే అందుబాటులోకి తెచ్చారు. ఇది ప్రపంచంలోనే పీపీపీ పద్ధతిలో చేపట్టిన అతిపెద్ద మెట్రో రైల్ ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది.
Telangana Government
Hyderabad Metro
Metro Rail Phase II
Hyderabad Airport Metro Limited
Revanth Reddy
Manohar Lal Khattar
Hyderabad Metro Expansion
Public Transportation
Metro Project

More Telugu News