YS Sharmila: జగన్ వాహనం కింద పడి సింగయ్య నలిగిపోయిన దృశ్యాలు భయానకం: షర్మిల

YS Sharmila Condemns Singaiahs Death in Jagans Convoy
  • జగన్ కాన్వాయ్ లో ప్రమాదం
  • జగన్ వాహనం కింద పడి సింగయ్య అనే వ్యక్తి మృతి
  • ప్రశ్నల వర్షం కురిపించిన షర్మిల
  • కారు కింద ఒక వ్యక్తి పడ్డారన్న స్పృహ లేకుండా కాన్వాయ్ కొనసాగడం ఏంటి అంటూ ఫైర్
వైసీపీ అధ్యక్షుడు జగన్ వాహనం కింద పడి సింగయ్య నలిగిపోయిన దృశ్యాలు భయానకం అంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల పేర్కొన్నారు. ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంది ఈ ఘటన అంటూ సోషల్ మీడియాలో స్పందించారు. ఈ మేరకు జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కారు కింద ఒక వ్యక్తి పడ్డారన్న సోయి లేకుండా కాన్వాయ్ కొనసాగడం ఏంటి ? 100 మందికి పర్మిషన్ ఇస్తే వేల మంది ముందు సైడ్ బోర్డు మీద నిలబడి జగన్ చేతులూపడం ఏంటి? అంటూ మండిపడ్డారు.

"ప్రజల ప్రాణాలు తీసే హక్కు మీకు ఎవరిచ్చారు ? బెట్టింగ్ లో ఓడిపోయి సూసైడ్ చేసుకున్న వ్యక్తి విగ్రహ ఆవిష్కరణకు ఇద్దరిని బలి ఇస్తారా ? ఇదేం రాజకీయం ? ఇదెక్కడి రాక్షస ఆనందం ? మీ ఉనికి కోసం జనాలను టైర్ల కింద తొక్కుకుంటూ పోతారా ? ప్రజల ప్రాణాల మీద శవ రాజకీయాలు చేస్తారా ? కార్ సైడ్ బోర్డ్ మీద నిలబడి ఒక నాయకుడిగా కాన్వాయ్ మూవ్ చేయించడం సబబేనా ? ఇది పూర్తిగా జగన్ గారి బాధ్యత రాహిత్యానికి అద్దం పడుతుంది.

బలప్రదర్శన చేసి సింగయ్య మృతికి కారణమైన జగన్, 100 మందికి అనుమతి ఇచ్చి వేల మందితో వచ్చినా దగ్గరుండి మరి చోద్యం చూసిన కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి. పర్మిషన్ కి విరుద్ధంగా జన సమీకరణ జరుగుతుంటే  పోలీసులు ఎలా సహకరించారు? ఎందుకు ప్రేక్షక పాత్ర వహించారు? ఎందుకు ఇంటలిజెన్స్ వ్యవస్థను నిద్ర పుచ్చారు?

ప్రజా సమస్యలపై పోరాడితే ఆంక్షలన్నీ కాంగ్రెస్ పార్టీకేనా? కాంగ్రెస్ చేసే ఉద్యమాలకు, ధర్నాలకు హౌజ్ అరెస్ట్ లు చేస్తారు. దీక్షలను భగ్నం చేస్తారు. ర్యాలీలను తొక్కిపెట్టి మా గొంతు నొక్కుతారు. వైసీపీ చేసిన బలప్రదర్శనలకు, హత్యలకు జగన్ ఏం సమాధానం ఇస్తారు ? చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల కూటమి ప్రభుత్వం దీనికి ఏం సమాధానం చెబుతుంది? దీనిపై ఏం చర్యలు తీసుకుంటున్నారు?" అంటూ షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ మేరకు జగన్ కాన్వాయ్ వీడియో కూడా పంచుకున్నారు.
YS Sharmila
Jagan Mohan Reddy
Singaiah death
Andhra Pradesh politics
YSRCP
Congress party
Chandrababu Naidu
Pawan Kalyan
political rally
road accident

More Telugu News