YS Jagan: సింగయ్య మృతి ఘటనలో జగన్‌పై కేసు నమోదు.. గుంటూరు ఎస్పీ ప్రకటన

Former CM YS Jagan Named Accused in Singaiah Death Case
  • సింగయ్య మృతి కేసులో  జగన్‌తో పాటు డ్రైవర్, మరికొందరు నేతల పేర్లు చేర్చిన పోలీసులు
  • ఈ నెల 18న గుంటూరు ఏటుకూరు రోడ్డులో ప్రమాదం
  • జగన్ కారు కింద సింగయ్య పడినట్లు వీడియో ఆధారాలున్నాయన్న ఎస్పీ
  • అనుమతికి మించి కాన్వాయ్‌లో వాహనాలున్నాయని వెల్లడి
మాజీ ముఖ్యమంత్రి జగన్ పల్నాడు పర్యటన సందర్భంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగయ్య అనే వృద్ధుడి మృతికి సంబంధించిన కేసులో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో జగన్ ను నిందితుడిగా చేర్చినట్లు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. ఆదివారం రాత్రి గుంటూరులోని ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ కేసుకు సంబంధించిన కీలక వివరాలను తెలిపారు.

ఈ నెల 18వ తేదీన మాజీ ముఖ్యమంత్రి జగన్ పల్నాడు పర్యటన సందర్భంగా గుంటూరులోని ఏటుకూరు రోడ్డు బైపాస్ వద్ద ఈ దురదృష్టకర సంఘటన జరిగిందని ఎస్పీ వివరించారు. రోడ్డు పక్కన తీవ్ర గాయాలతో పడి ఉన్న సింగయ్య అనే వృద్ధుడిని గుర్తించి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారని తెలిపారు. వెంగళాయపాలెం గ్రామానికి చెందిన సింగయ్య మృతిపై ఆయన భార్య  ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొదట కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

అనంతరం, ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేపట్టామని, ఇందులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్‌లు, డ్రోన్ కెమెరా దృశ్యాలు, ఘటనా స్థలంలో ఉన్నవారు తీసిన వీడియోలను క్షుణ్ణంగా పరిశీలించామని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. "లభించిన ఒక వీడియోలో... మృతుడు సింగయ్య మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రయాణిస్తున్న ఫార్చ్యూనర్ వాహనం కింద పడిపోవడం, వాహనం టైరు ఆయనపై నుంచి వెళ్లినట్లు స్పష్టంగా ఉంది" అని ఎస్పీ పేర్కొన్నారు. ఈ కీలక ఆధారాల నేపథ్యంలో, తాము కేసు సెక్షన్లను మార్చి, భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 105 (నిర్లక్ష్యం కారణంగా మరణానికి కారణమవడం), సెక్షన్ 49 కింద కేసు నమోదు చేశామని వివరించారు.

ఈ కేసులో వాహనం నడిపిన డ్రైవర్ రమణారెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్, అలాగే కాన్వాయ్‌లో ఉన్నట్లుగా భావిస్తున్న నాగేశ్వర్ రెడ్డి, సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజనిలను కూడా నిందితుల జాబితాలో చేర్చినట్లు ఎస్పీ తెలిపారు. "జగన్‌కు 14 వాహనాలకు మాత్రమే అనుమతి ఇచ్చాం. కానీ, తాడేపల్లి నుంచి కాన్వాయ్ ప్రారంభమైనప్పుడు దాదాపు 50 వాహనాలతో పర్యటన సాగింది. లభించిన ఆధారాల మేరకు దర్యాప్తు కొనసాగిస్తున్నాం. చట్టప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటాం" అని సతీష్ కుమార్ స్పష్టం చేశారు.

జూన్ 18న సత్తెనపల్లిలో ఒక విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని, ప్రమాదం జరిగిన రోజు అప్పటికి అందుబాటులో ఉన్న సమాచారం మేరకే ఆరోజు వేరే  ప్రైవేట్ వాహనం కింద  సింగయ్య పడిపోయాడని చెప్పామని, అయితే లోతైన దర్యాప్తులో మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని ఎస్పీ పేర్కొన్నారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, చట్టప్రకారంగానే కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి, తుది నిర్ణయానికి వస్తామని ఆయన మీడియాకు వివరించారు.
YS Jagan
Singaiah death
Andhra Pradesh
Guntur SP
Road accident
Palanadu district
negligence case
Former CM Jagan
Accident investigation
Satish Kumar SP

More Telugu News