Marco Rubio: ప్రతీకార చర్యలకు దిగితే ఇరాన్ పరిస్థితి మరింత దుర్భరం అవుతుంది: అమెరికా

Marco Rubio warns Iran against retaliation after US strikes
  • ఇరాన్ నిర్ణయాన్ని బట్టే అమెరికా కార్యాచరణ ఉంటుందన్న ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రుబియో
  • ఇరాన్ శాంతిని కోరుకుంటే అందుకు సిద్దమని వెల్లడి
  • అమెరికా మిత్రదేశాలపై ఇరాన్ దాడులకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిక
ఇరాన్ అణు కార్యక్రమానికి గట్టి దెబ్బ తగిలేలా అమెరికా 'ఆపరేషన్ మిడ్‌నైట్ హామర్' పేరుతో భారీ వైమానిక దాడులు చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇరాన్‌లోని ఫోర్డో, నతాంజ్, ఇన్‌ఫహాన్‌లలో ఉన్న కీలక అణు కేంద్రాలను అమెరికా ధ్వంసం చేసింది. అయితే, ఇప్పటి వరకు టెహ్రాన్ ఎలాంటి ప్రతిచర్యకు దిగలేదు. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ నిర్ణయంపైనే అమెరికా కార్యాచరణ ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు.

ఇరాన్ ప్రభుత్వం శాంతిని కోరుకుంటే, అందుకు తాము సిద్ధంగా ఉన్నామని, లేదు ప్రతీకార చర్యలకు దిగితే ఇరాన్ పరిస్థితి మరింత దుర్భరంగా మారుతుందని, కనీసం సొంత గగనతలాన్ని కూడా రక్షించుకోలేదని రుబియో అన్నారు. అమెరికా సైనిక దళాలకు ఆతిథ్యమిచ్చే దేశాలపై ఇరాన్ దాడులకు పాల్పడినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.

కాగా, ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ అభ్యర్థన మేరకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమైంది. అమెరికా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి ఇరాన్‌లోని అణు కేంద్రాలపై దాడులు చేసిందని ఇరాన్ ప్రతినిధి అమిర్ సయాద్ ఇర్వానీ ఐక్యరాజ్యసమితిలో ఫిర్యాదు చేస్తూ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ఈ అంశంపై చర్చించాలని విజ్ఞప్తి చేశారు. 
Marco Rubio
Iran
United States
nuclear program
Operation Midnight Hammer
UN Security Council
air strikes
nuclear facilities
international law
Amir Sayyad Irvani

More Telugu News