Vijay: ‘జన నాయగన్‌’ చివరి సినిమానేనా? విజయ్‌ సమాధానం ఇదే!

Vijay Thalapathy Jana Gana Mana Could Be Last Film Says Mamitha Baiju
  • ‘జన నాయగన్‌’ తన చివరి సినిమానా కాదా అనేది ఇప్పుడే చెప్పలేనన్న విజయ్
  • 2026 ఎన్నికల ఫలితాలపై తన నిర్ణయం ఆధారపడి ఉంటుందని వెల్లడి
  • ఈ విషయాన్ని నటి మమితా బైజుతో పంచుకున్న విజయ్ 
  • ‘జన నాయగన్‌’ షూటింగ్ చివరి రోజు విజయ్ భావోద్వేగం
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తన రాజకీయ ప్రవేశంపై గత కొంతకాలంగా వస్తున్న ఊహాగానాలకు మరింత ఆసక్తిని రేకెత్తించారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘జన నాయగన్‌’ చిత్రమే తన చివరి సినిమా అవుతుందా? అనే ప్రశ్నకు విజయ్ సూటిగా సమాధానం చెప్పలేదని, తన నిర్ణయం 2026 ఎన్నికల ఫలితాలపై ఆధారపడి ఉంటుందని చెప్పినట్లు నటి మమితా బైజు వెల్లడించారు. ఈ వ్యాఖ్యలతో విజయ్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టే అవకాశాలున్నాయనే చర్చ జోరందుకుంది.

‘జన నాయగన్‌’ చిత్రంలో విజయ్‌తో కలిసి నటిస్తున్న మమితా బైజు ఇటీవల ఓ సందర్భంలో మాట్లాడుతూ, షూటింగ్ సమయంలో విజయ్‌ను ఈ విషయం గురించి అడిగినట్లు తెలిపారు. "‘జన నాయగన్‌’ మీ చివరి సినిమానా అని విజయ్‌ గారిని అడిగాను. దానికి ఆయన, ‘ఆ విషయం ఇప్పుడే చెప్పలేను. అది 2026 ఎన్నికలపై ఆధారపడి ఉంటుంది’ అని నాతో అన్నారు" అని మమిత వివరించారు. 

ఇక‌, ఈ సినిమా చిత్రీకరణ చాలా సరదాగా సాగిందని, చివరి రోజు షూటింగ్‌లో చిత్ర యూనిట్ సభ్యులందరితో పాటు విజయ్ కూడా భావోద్వేగానికి గురయ్యారని, అందుకే టీమ్‌తో కలిసి ఫొటోలు కూడా దిగలేకపోయారని ఆమె గుర్తుచేసుకున్నారు. అయితే, సినిమాలో తన పాత్ర గురించి ఇప్పుడే ఏమీ చెప్పనని, తెరపైనే చూడాలని మమిత తెలిపారు.

హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జన నాయగన్‌’ చిత్రాన్ని పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రకటించినప్పటి నుంచి ఇది విజయ్ చివరి చిత్రం కావచ్చనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. 

ఈ నేపథ్యంలో విజయ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ‘ది ఫస్ట్ రోర్’ అనే వీడియోకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇందులో విజయ్ పవర్‌ఫుల్ పోలీస్ అధికారి లుక్‌లో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. విజయ్ రాజకీయ ప్రవేశం, సినిమాలకు వీడ్కోలు వంటి అంశాలపై స్పష్టత రావాలంటే 2026 వరకు వేచి చూడాల్సిందేనని తాజా పరిణామాలతో అర్థమవుతోంది.
Vijay
Jana Gana Mana
Mamitha Baiju
Tamil Nadu politics
2026 Elections
H Vinoth
Pooja Hegde
Kollywood
The First Roar

More Telugu News