Dharmapuri Arvind: కేటీఆర్‌కు ఓటమి ఖాయం, హరీశ్ రావు తప్ప ఆ పార్టీలో ఎవరూ గెలవరు: ఎంపీ అరవింద్ జోస్యం

Dharmapuri Arvind Predicts KTR Loss Harish Rao Only Winner in BRS
  • జూన్ 29న నిజామాబాద్‌కు కేంద్ర మంత్రి అమిత్ షా
  • పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించనున్న హోంమంత్రి
  • దివంగత నేత డి. శ్రీనివాస్ విగ్రహావిష్కరణ, రైతు సమ్మేళనం సభకు హాజరు
  • బీఆర్ఎస్ అవినీతిలో కూరుకుపోయిందన్న ఎంపీ అరవింద్
  • ఆ పార్టీ నేతలను వెంటనే జైలుకు పంపాలని డిమాండ్
  • రేవంత్ రెడ్డి తీరుపై అర్వింద్ విమర్శలు
రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఓటమి తప్పదని, ఆ పార్టీ నుంచి మాజీ మంత్రి హరీశ్ రావు మినహా మరెవరూ గెలిచే అవకాశం లేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ అవినీతిలో పూర్తిగా కూరుకుపోయిందని ఆరోపించిన ఆయన, ఆ పార్టీ నాయకులను తక్షణమే అరెస్ట్ చేసి జైలుకు పంపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం బెదిరించి, సాయంత్రం వారితోనే మిలాఖత్ అయితే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉండదని హెచ్చరించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని ఆయన హితవు పలికారు.

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా త్వరలో నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారని ఆయన తెలిపారు. జూన్ 29వ తేదీన అమిత్ షా నిజామాబాద్‌కు విచ్చేసి, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా, రైతుల చిరకాల వాంఛ అయిన పసుపు బోర్డు కార్యాలయాన్ని అమిత్ షా ప్రారంభిస్తారని ఎంపీ అరవింద్ పేర్కొన్నారు. ఈ పరిణామం పసుపు రైతులకు ఒక నూతన శకాన్ని ఆరంభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

కేంద్ర మంత్రి అమిత్ షా తన పర్యటనలో భాగంగా, నిజామాబాద్‌లో పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవంతో పాటు, దివంగత కాంగ్రెస్ సీనియర్ నేత డి. శ్రీనివాస్ విగ్రహాన్ని కూడా ఆవిష్కరిస్తారని ఎంపీ అరవింద్ తెలిపారు. అనంతరం, స్థానిక పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో 'రైతు సమ్మేళనం' పేరుతో ఒక భారీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమ్మేళనంలో అమిత్ షా పాల్గొని రైతులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
Dharmapuri Arvind
KTR
Harish Rao
BRS party
Telangana elections
Amit Shah
Nizamabad

More Telugu News