Botsa Satyanarayana: తాట తీస్తాం, భూస్థాపితం చేస్తాం వంటి మాటలతో విలువ తగ్గించుకోవద్దు: బొత్స సత్యనారాయణ

Botsa Satyanarayana Slams Government Over Jagan Accident Investigation
  • జగన్ పర్యటనలో పోలీసుల వైఫల్యంపై బొత్స తీవ్ర ఆగ్రహం
  • ఎస్పీ మాట మార్చడం వెనుక రాజకీయ ఒత్తిళ్లున్నాయని ఆరోపణ
  • రాష్ట్రంలో రాజకీయాలు పూర్తిగా దిగజారిపోయాయని ఆవేదన
రాష్ట్రంలో రాజకీయాలు పూర్తిగా దిగజారిపోయాయని, పరిస్థితులు అత్యంత దయనీయంగా మారాయని వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ అధినేత జగన్ పర్యటనలో జరిగిన ప్రమాదం విషయంలో పోలీసుల వైఖరి, ఆ తర్వాతి పరిణామాలు చూస్తుంటే ప్రభుత్వ తీరు స్పష్టమవుతోందన్నారు.

ప్రమాదం జగన్ వాహనం వల్ల కాకుండా వేరే వాహనం వల్ల జరిగిందని తొలుత జిల్లా ఎస్పీయే స్వయంగా చెప్పారని, అయితే ఆ తర్వాత మాట మార్చడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనేది స్పష్టంగా తెలుస్తోందని బొత్స ఆరోపించారు. "ప్రమాదానికి కారణమైన వారిని పిలిచి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించిన అధికారులు, మళ్లీ ఎందుకు మాట మార్చారు? చంద్రబాబు తత్వం చూశాక రాజకీయాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు" అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేత పర్యటనకు అనుమతి ఇచ్చినప్పుడు రోప్ పార్టీ ఏమైందని, పోలీసు వ్యవస్థ ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. కేవలం కక్ష సాధింపు, దుర్మార్గమైన ఆలోచనలతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

యోగా దినోత్సవం పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి వ్యక్తిగత ప్రచారం చేసుకోవడం ఎంతవరకు సమంజసమని బొత్స నిలదీశారు. "పీ4 అంటే కేవలం పబ్లిసిటీ మాత్రమేనా? యోగా డే కోసం చేసిన ఖర్చుతో విశాఖకు ఏం మేలు జరిగిందో చెప్పగలరా?" అని ప్రశ్నించారు. యోగా దినోత్సవం వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే జగన్ కారు ప్రమాదాన్ని తెరపైకి తెచ్చారని ఆయన దుయ్యబట్టారు. యోగాంధ్ర గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా ఒక బోగస్ అని, లెక్కల్లో తేడాలున్నాయని ఆయన ఆరోపించారు. 

యువత చేస్తున్న ఆందోళనలపై లాఠీఛార్జ్ చేయడం దుర్మార్గమని, ఇచ్చిన హామీలను మెడలు వంచైనా అమలు చేయిస్తామని బొత్స స్పష్టం చేశారు. "తాట తీస్తాం, భూస్థాపితం చేస్తాం వంటి మాటలతో విలువ తగ్గించుకోవద్దని సూచిస్తున్నాను. ప్రజానాయకుడు బయటకు వచ్చినప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా వస్తే బందోబస్తు ఏర్పాటు చేయడం పోలీసుల బాధ్యత కాదా?" అని ఆయన అన్నారు. గాయపడిన వ్యక్తిని ప్రైవేటు వాహనంలో ఆసుపత్రికి తరలించకుండా ఎస్సై అడ్డుకున్నది వాస్తవం కాదా అని కూడా ప్రశ్నించారు. షర్మిల కేవలం తన ఉనికిని చాటుకునేందుకే కూటమి నేతలు జగన్‌పై ఎప్పుడు మాట్లాడతారా అని ఎదురు చూస్తుంటారని వ్యాఖ్యానించారు. 
Botsa Satyanarayana
YS Jagan Mohan Reddy
Visakhapatnam
Andhra Pradesh Politics
YCP
TDP
Chandrababu Naidu
Yoga Day
Police
YS Sharmila

More Telugu News