Air India: గల్ఫ్ గగనతలంలో ఉద్రిక్తత.. ఎయిరిండియా కీలక నిర్ణయం

Air India Cancels Flights Due to Gulf Tensions
  • గల్ఫ్ ప్రాంతం మీదుగా నడిచే విమాన సర్వీసులు తక్షణమే రద్దు
  • పశ్చిమాసియా, ఉత్తర అమెరికా, యూరప్‌కు వెళ్లే సర్వీసులపైనా ప్రభావం
  • కొన్ని విమానాలు వెనక్కి, మరికొన్ని దారి మళ్లింపు
  • ఇండిగో సర్వీసులపైనా ప్రభావం
అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రతీకార దాడులకు దిగిన నేపథ్యంలో భారత విమానయాన సంస్థ ఎయిరిండియా కీలక ప్రకటన చేసింది. గల్ఫ్ ప్రాంతం మీదుగా ప్రయాణించే తమ విమాన సర్వీసులన్నింటినీ తక్షణమే రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ నిర్ణయం తదుపరి ప్రకటన వెలువడే వరకు అమలులో ఉంటుందని స్పష్టం చేసింది.

పశ్చిమాసియాలోని దేశాలు, ఉత్తర అమెరికాలోని తూర్పు తీర నగరాలు, యూరప్‌కు నడిపే విమాన సర్వీసులను కూడా నిలిపివేస్తున్నట్లు ఎయిరిండియా తెలియజేసింది. ఇప్పటికే ఉత్తర అమెరికా నుంచి భారత్‌కు బయలుదేరిన కొన్ని విమానాలను వెనక్కి మళ్లించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. భారత్ నుంచి టేకాఫ్ అయిన కొన్ని విమానాలను కూడా ఇతర మార్గాల ద్వారా వెనక్కి రప్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికుల భద్రత, క్షేమమే తమకు అత్యంత ప్రాధాన్యమని, పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామని ఎయిరిండియా వివరించింది.

ఎయిరిండియాతో పాటు గల్ఫ్ ప్రాంతం మీదుగా విమానాలు నడిపే మరికొన్ని సంస్థలు కూడా తమ సర్వీసులను నిలిపివేశాయి. కొన్ని విమానాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించాయి. అంతకుముందు కొచ్చి నుంచి ఖతార్‌లోని దోహాకు బయలుదేరిన ఎయిరిండియా విమానాన్ని మస్కట్‌కు దారి మళ్లించారు. అలాగే కన్నూర్ నుంచి బయలుదేరిన మరో ఎయిరిండియా విమానం కూడా వెనక్కి తిరిగి వచ్చింది.

మరోవైపు పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల కారణంగా దుబాయ్, దోహా, బహ్రెయిన్, దామమ్, అబుదాబీ, కువైట్, తిబ్లిసీ వంటి నగరాల నుంచి రాకపోకలు సాగించాల్సిన ఇండిగో విమాన సర్వీసులపైనా ప్రభావం పడింది. తాము కూడా పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు ఇండిగో సంస్థ పేర్కొంది.

అయితే, ఇరాన్ దాడులు ప్రస్తుతానికి ఆగిపోవడంతో బహ్రెయిన్, కువైట్‌లు తమ గగనతలాన్ని తిరిగి తెరిచినట్లు సమాచారం. ఈ తాత్కాలిక విరామంతో కొన్ని ఫ్లైట్ ఆపరేషన్లు తిరిగి ప్రారంభమయ్యాయని మీడియా వర్గాలు వెల్లడించాయి. దుబాయ్ ఎయిర్‌పోర్టు కూడా కార్యకలాపాలను పునఃప్రారంభించింది. అయినప్పటికీ, కొన్ని విమాన సర్వీసులు రద్దు కాగా, మరికొన్ని ఆలస్యంగా నడవనున్నాయని దుబాయ్ మీడియా ఆఫీస్ తెలియజేసింది.
Air India
Gulf tension
Flight cancellations
Middle East conflict
Aviation safety
Indigo flights
Dubai airport
Iran attacks
Bahrain airspace
Kuwait airspace

More Telugu News