Barkha Madan: సన్యాసినిగా మారిపోయి హిమాలయ పర్వత ప్రాంతంలో గడుపుతున్న వర్మ హీరోయిన్

Barkha Madan Former Bollywood Star Now Buddhist Nun
  • సినీ గ్లామర్ వదిలి సన్యాసం తీసుకున్న నటి బర్ఖా మదన్
  • 'ఖిలాడియోంకా ఖిలాడి', 'భూత్' చిత్రాలతో గుర్తింపు
  • ఆత్మశాంతి కోసమే ఆధ్యాత్మిక మార్గం ఎంచుకున్నట్లు సమాచారం
సినిమా రంగంలో పేరు, ప్రఖ్యాతులు, కోట్ల రూపాయల సంపాదన ఉన్నప్పటికీ, కొందరికి మానసిక ప్రశాంతత కరువవుతుంది. ఇలాంటి సందర్భాల్లో కొందరు సంచలన నిర్ణయాలు తీసుకుంటుంటారు. అలాంటి ఓ అరుదైన నిర్ణయం తీసుకుని వార్తల్లో నిలిచారు ఒకనాటి బాలీవుడ్ నటి బర్ఖా మదన్. కెరీర్‌లో మంచి విజయాలు అందుకుని, ప్రేక్షకులను మెప్పించిన ఆమె, అనూహ్యంగా అన్నింటినీ వదులుకుని సన్యాసం స్వీకరించారు. ప్రస్తుతం ఆమె బౌద్ధ సన్యాసినిగా ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్నారు.

ఒకప్పుడు మోడల్‌గా కెరీర్ ప్రారంభించి, ‘మిస్ ఇండియా’ పోటీల్లో ఫైనలిస్ట్ వరకు వెళ్లిన బర్ఖా మదన్, 1996లో అక్షయ్ కుమార్, సీనియర్ నటి రేఖతో కలిసి నటించిన ‘ఖిలాడియోంకా ఖిలాడి’ చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత పలు హిందీ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా, 2003లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన హారర్ థ్రిల్లర్ ‘భూత్’ సినిమాలో ఆమె నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. అతి తక్కువ సమయంలోనే దాదాపు 20 సినిమాల్లో నటించడమే కాకుండా, పలు టెలివిజన్ షోలలో కూడా కనిపించి అలరించారు.

అయితే, ఈ గ్లామర్ ప్రపంచం, సినిమా విజయాలు బర్ఖా మదన్‌కు పూర్తిస్థాయి సంతృప్తిని ఇవ్వలేకపోయాయని తెలుస్తోంది. పేరు ప్రఖ్యాతులు, ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ, ఆమె మనసు ఆత్మశాంతి వైపు మొగ్గు చూపింది. ఈ క్రమంలోనే ఆమె బౌద్ధ ధర్మాన్ని ఆశ్రయించారు. లోతైన ధ్యాన సాధన, ఆధ్యాత్మిక చింతన కోసం సన్యాసాన్ని స్వీకరించారు.

ప్రస్తుతం బర్ఖా మదన్ పేరు వెనరబుల్ గ్యాల్టెన్ సామ్టెన్. ఆమె హిమాలయ పర్వత ప్రాంతంలోని ఓ బౌద్ధ ఆశ్రమంలో నివసిస్తూ, ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ధ్యానం, ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, పూర్తి సమయాన్ని వీటికే కేటాయిస్తున్నట్లు సమాచారం. ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇలా సన్యాసిగా మారడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 
Barkha Madan
Bollywood actress
Bhout film
Ram Gopal Varma
Buddhist nun
Himalayas
spiritual life
Miss India
Khiladiyon Ka Khiladi
Gyalten Samten

More Telugu News