KL Rahul: తొలి టెస్ట్ మ్యాచ్‌కు బ్లాక్ బ‌స్ట‌ర్ ముగింపు.. ఫలితం ఖాయం: కేఎల్ రాహుల్‌

KL Rahul Confident of India Win in Leeds Test
  • భారత బౌలర్లు 10 వికెట్లు తీసి గెలిపిస్తారని రాహుల్‌ ధీమా
  • జట్టులో తన పాత్ర, బాధ్యతలపై స్టార్ బ్యాట‌ర్ సంతృప్తి
  • రెండో ఇన్నింగ్స్‌లో రాహుల్ కీలక శతకం (137)
  • పంత్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 195 పరుగుల భాగస్వామ్యం
లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో కచ్చితంగా ఫలితం వస్తుందని టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ ధీమా వ్యక్తం చేశాడు. నాలుగో రోజు ఆట ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, భారత బౌలర్లు అద్భుతంగా రాణించి జట్టుకు విజయాన్ని అందిస్తారని ఆశాభావం వ్య‌క్తం చేశాడు. ఈ మ్యాచ్‌ అభిమానులకు గొప్ప వినోదాన్ని పంచుతుందని, చివరి రోజు ఆట ఉత్కంఠభరితంగా సాగుతుందని అన్నాడు.

ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడం ఖాయమని రాహుల్ జోస్యం చెప్పాడు. "ఈ టెస్టు మ్యాచ్‌కి ఒక బ్లాక్‌బస్టర్ ముగింపు ఉంటుంది. కచ్చితంగా ఫలితం వస్తుంది. ఇంగ్లండ్ ఆటగాళ్లు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. మా బౌలర్లు చివరి రోజు పది వికెట్లు పడగొట్టి టీమిండియాకు సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని అందిస్తారని నమ్ముతున్నాను" అని కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు.

ఇక‌, భారత రెండో ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఆయన 137 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా రిషభ్ పంత్ (115)తో కలిసి నాలుగో వికెట్‌కు 195 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వీరిద్దరి ప్రదర్శనతో టీమిండియా, ఇంగ్లండ్ ముందు 371 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది.

అలాగే గత కొంతకాలంగా జట్టులో తన బ్యాటింగ్ స్థానంపై ఉన్న సందిగ్ధత తొలగిపోయిందన్నాడు. విభిన్న బాధ్యతలు నిర్వర్తించడం సంతోషంగా ఉందని రాహుల్ పేర్కొన్నాడు. "గత రెండు సంవత్సరాలుగా బ్యాటింగ్ ఆర్డర్‌లో నా స్థానం ఏంటి? నాకు ఏది సౌకర్యంగా ఉంటుందో? అన్న విషయం నేను దాదాపు మర్చిపోయాను. ఇప్పుడు నాకు వివిధ బాధ్యతలు, పాత్రలు ఇవ్వడం ఆనందంగా ఉంది. ఇది నాలో మరింత ఉత్సాహాన్ని నింపింది. నన్ను నేను సవాలు చేసుకోవడానికి, మరింత రాటుదేలడానికి ఇది దోహదపడింది. ఈ ప్రయాణాన్ని నేను ఎంతగానో ఆస్వాదిస్తున్నాను" అని కేఎల్ రాహుల్ తెలిపాడు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే, 371 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ జట్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 350 పరుగులు చేయాల్సి ఉంది. భార‌త్ గెల‌వాలంటే ప‌ది వికెట్లు ప‌డ‌గొట్టాలి. దీంతో చివరి రోజు ఆటపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
KL Rahul
India vs England
Leeds Test
Cricket
Test Match
Rishabh Pant
Indian Cricket Team
England Cricket Team
Cricket Series

More Telugu News