India vs England: లీడ్స్ టెస్టులో టీమిండియా చరిత్ర.. 93 ఏళ్ల టెస్ట్ క్రికెట్‌లో అరుదైన ఘనత!

India Achieve Historic First In 93 Years Register Rarest Of Rare Feat
  • ఒకే టెస్ట్ మ్యాచ్‌లో ఐదు సెంచరీలు నమోదు
  • భారత్ 93 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి
  • టెస్ట్ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన ఆరో జట్టుగా భారత్
  • విదేశీ గడ్డపై ఈ రికార్డు అందుకున్న రెండో జట్టు టీమిండియా
ఇంగ్లండ్‌తో జరుగుతున్న లీడ్స్ టెస్టులో భారత క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. తమ 93 ఏళ్ల టెస్ట్ క్రికెట్ ప్రస్థానంలో (1932లో తొలి టెస్ట్ ఆడింది) ఒకే టెస్ట్ మ్యాచ్‌లో ఏకంగా ఐదు సెంచరీలు నమోదు చేయడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్ భారత బ్యాటర్లకు పరుగుల పండుగలా మారింది.

తొలి ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ (159 బంతుల్లో 101 పరుగులు, 16 ఫోర్లు), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (227 బంతుల్లో 147 పరుగులు, 19 ఫోర్లు, ఒక సిక్స్), రిషబ్ పంత్ (178 బంతుల్లో 134 పరుగులు, 12 ఫోర్లు, ఆరు సిక్సర్లు) శతకాలతో కదం తొక్కారు. వీరి అద్భుత బ్యాటింగ్‌తో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 471 పరుగుల భారీ స్కోరు సాధించింది.

అనంతరం ఇంగ్లండ్ కూడా దీటుగా బదులివ్వడంతో భారత్‌కు కేవలం ఆరు పరుగుల స్వల్ప ఆధిక్యం మాత్రమే లభించింది. తొలి ఇన్నింగ్స్‌లో అర్ధసెంచరీ చేజార్చుకున్న కేఎల్ రాహుల్, రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత శతకం (137)తో ఆ లోటును భర్తీ చేసుకున్నాడు. మరోవైపు రిషభ్‌ పంత్ కూడా మరో సెంచరీ (140 బంతుల్లో 118 పరుగులు, 15 ఫోర్లు, మూడు సిక్సర్లు) సాధించి, ఒకే టెస్టులో రెండు శతకాలు బాదిన తొలి భారత వికెట్ కీపర్ బ్యాటర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. కేఎల్ రాహుల్‌తో కలిసి పంత్ కీలకమైన 195 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇన్నింగ్స్‌ను పటిష్ఠం చేశాడు.

టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక జట్టు ఒకే మ్యాచ్‌లో ఐదు సెంచరీలు చేయడం ఇది కేవలం ఆరోసారి మాత్రమే. కాగా, విదేశీ గడ్డపై ఈ ఘనత సాధించిన రెండో జట్టుగా భారత్ నిలిచింది. ఇంతకుముందు 1955లో కింగ్‌స్టన్‌లో వెస్టిండీస్‌పై ఆస్ట్రేలియా ఈ ఫీట్ సాధించింది. ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్లు కోలిన్ మెక్‌డొనాల్డ్ (127), నీల్ హార్వే (204), కీత్ మిల్లర్ (109), రాన్ ఆర్చర్ (128), రిచీ బెనాడ్ (121) ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు సెంచరీలు సాధించారు. దాంతో ఆసీస్‌ 758/8 వద్ద డిక్లేర్డ్ చేసింది. ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ తేడాతో గెలుపొందింది.

కాగా, భార‌త్‌, ఇంగ్లాండ్ మ్యాచ్ విషయానికొస్తే, 371 పరుగుల లక్ష్య ఛేదనలో ఆతిథ్య‌ జట్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 350 పరుగులు చేయాల్సి ఉంది. గిల్ సేన‌ గెల‌వాలంటే ప‌ది వికెట్లు ప‌డ‌గొట్టాలి. దీంతో చివరి రోజు ఆటపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
India vs England
Shubman Gill
Leeds Test
Yashasvi Jaiswal
Rishabh Pant
KL Rahul
Test Cricket
Cricket Records
Indian Cricket Team
Test Match Centuries

More Telugu News