Etela Rajender: ఫోన్ ట్యాపింగ్ ఎవరి ఆదేశాలతో చేశారు?: ఈటల రాజేందర్ నిలదీత

Etela Rajender Demands Answers on Phone Tapping Orders
  • ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందు ఈటల వాంగ్మూలం
  • ప్రభాకర్ రావు ఎవరి ఆదేశాలతో ట్యాపింగ్ చేశారో చెప్పాలన్న ఈటల
  • హుజూరాబాద్, గజ్వేల్, మునుగోడు ఎన్నికల్లో తన ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపణ
  • ప్రభాకర్ రావు నియామకం నిబంధనలకు విరుద్ధమని వ్యాఖ్య
  • కాళేశ్వరం, ట్యాపింగ్ నివేదికలు బయటపెట్టాలని ప్రభుత్వానికి డిమాండ్
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఎవరి ఆదేశాల మేరకు ఫోన్లను ట్యాపింగ్ చేశారో స్పష్టం చేయాలని మల్కాజ్‌గిరి ఎంపీ, బీజేపీ నేత ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి నేడు సిట్ ముందు హాజరై ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు.

అనంతరం ఈటల మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, గతంలో తన ఫోన్‌ను అనేక సందర్భాల్లో ట్యాప్ చేశారని ఆరోపించారు. "నేను హుజూరాబాద్‌లో పోటీ చేసినప్పుడు, 2023లో గజ్వేల్‌లో ఎన్నికల బరిలో నిలిచినప్పుడు అత్యంత దుర్మార్గమైన పద్ధతిలో నా ఫోన్‌ను ట్యాప్ చేశారు. అంతేకాకుండా, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో మేం ఎవరితో సంభాషిస్తున్నాం, ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నామనేది కూడా ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్నారు. మా పార్టీ నాయకుల మధ్య జరిగిన సంభాషణలను సైతం కాల్ డేటాలో పొందుపరిచారు. ధైర్యంగా ఎదుర్కోలేనివారే ఇలాంటి చట్టవ్యతిరేకమైన పనులకు పాల్పడతారు" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభాకర్ రావు నియామకంపై కూడా ఈటల రాజేందర్ పలు ప్రశ్నలు లేవనెత్తారు. "ప్రభాకర్ రావు ఐపీఎస్ అధికారి కాకపోయినా, నిబంధనలకు విరుద్ధంగా ఆయనను ఎస్‌ఐబీ చీఫ్‌గా నియమించారు. ఒక విశ్రాంత అధికారిని కీలకమైన పదవిలో అక్రమంగా కొనసాగించారు. మార్గదర్శకాలన్నింటినీ తుంగలో తొక్కారు. ఫోన్లు ట్యాప్ చేయడం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టు లాంటిది. ఈ వ్యవహారంలో కేవలం రాజకీయ నాయకులే కాకుండా, జడ్జిలు, మంత్రులు, పార్టీల ముఖ్య నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు" అని ఆయన ఆరోపించారు.

గత ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ విభాగం మొత్తం నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కనుసన్నల్లోనే నడిచిందని ఈటల విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై నియమించిన కమిటీ ఇచ్చిన నివేదికను ఇప్పటికీ ప్రభుత్వం బయటపెట్టకపోవడంపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. "ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ కమిషన్ వేసి దాదాపు ఏడాదిన్నర కావస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు లాలూచీ పడకపోతే, ఈ విచారణ నివేదికలను ఎందుకు వెల్లడించడం లేదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలి" అని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో దోషులు ఎంతటివారైనా కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు.
Etela Rajender
Telangana politics
phone tapping case
SIB Prabhakar Rao
KCR

More Telugu News