Revanth Reddy: కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

Revanth Reddy Criticizes KCR KTR and Harish Rao Over Telangana Debt
  • ఆ ముగ్గురు కోటీశ్వరులు ఎలా అయ్యారని ప్రశ్న
  • రైతులకే తమ ప్రభుత్వంలో మొదటి ప్రాధాన్యమన్న సీఎం రేవంత్
  • గత కేసీఆర్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు
  • కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ధ్యేయమని ప్రకటన
  • పదేళ్ల బీఆర్ఎస్, 18 నెలల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమన్న ముఖ్యమంత్రి
తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ హయాంలో అప్పుల కుప్పగా మారితే, కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు మాత్రం ఎలా సంపన్నులయ్యారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు భరోసా నిధుల పంపిణీ కార్యక్రమం మంగళవారంతో ముగిసింది. ఈ సందర్భంగా సచివాలయం ఎదుట రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన 'రైతు నేస్తం' కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన, తమ 18 నెలల కాంగ్రెస్ పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన సవాల్ విసిరారు.

కేవలం తొమ్మిది రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి రూ.9 వేల కోట్ల నిధులను జమ చేసినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. రైతుల ఆశీర్వాదం వల్లే తాను చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయ్యానని, వారి అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తమ ప్రజా ప్రభుత్వంలో రైతులకు మొదటి ప్రాధాన్యత ఉంటుందని, ఆ తర్వాతే మహిళలు, యువతకు స్థానం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

వ్యవసాయాన్ని దండగ అనే స్థాయి నుంచి పండగలా మార్చేందుకే వైఎస్ రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రవేశపెట్టారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 25 లక్షల మందికి పైగా రైతులకు రుణమాఫీ చేశామని ఆయన తెలిపారు. గతంలో వరి వేసుకుంటే ఉరేననే పరిస్థితి ఉండేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సన్నవడ్లు పండిస్తే బోనస్ ఇస్తామని చెప్పి, 48 గంటల్లోనే డబ్బులు జమ చేశామని వివరించారు. దేశంలోనే అత్యధికంగా వరి పండించే రాష్ట్రంగా తెలంగాణ నిలవడం గర్వకారణమని, వ్యవసాయం అంటే రైతును రాజును చేయడమేనని ఆయన ఉద్ఘాటించారు.

ఈ సందర్భంగా గత ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ రాష్ట్రం నెత్తిన రూ.8 లక్షల కోట్లకు పైగా అప్పులు పెట్టి వెళ్లారని ఆరోపించారు. లక్ష కోట్ల రూపాయలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం, కూలడం కూడా జరిగిపోయిందని విమర్శించారు. "కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్ రావులకు ఫామ్‌హౌస్‌లు ఎలా వచ్చాయి? రాష్ట్రం దివాలా తీస్తే వారంతా ఎలా సంపన్నులయ్యారు?" అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో వేలాది ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 60 వేల ఉద్యోగాలు కల్పించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గ్రామాల్లో 'అమ్మ ఆదర్శ పాఠశాలలు' తీసుకువచ్చి విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమని పునరుద్ఘాటించారు. ఇందుకోసం అనేక చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. మహిళలు సౌర విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్రోత్సహిస్తున్నామని, వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్‌పై విద్యుత్‌శాఖతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు.

మహిళలకు రూ.21 వేల కోట్ల వడ్డీలేని రుణాలు అందించి ఆదుకున్నామని చెప్పారు. మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల విక్రయానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, శిల్పారామంలో 150 షాపుల ఏర్పాటుకు స్థలం కేటాయించామని అన్నారు. వెయ్యి బస్సులు కొని ఆర్టీసీకి మహిళలు అద్దెకు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని, 8 వేల ఐకేపీ కేంద్రాలను మహిళలకే అప్పగించామని వివరించారు. పాఠశాలల్లో ఆహార పదార్థాల సరఫరా బాధ్యతను కూడా స్వయం సహాయక సంఘాలకే అప్పగించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
Revanth Reddy
Telangana
KCR
KTR
Harish Rao
Rythu Bharosa
Congress
Farmers welfare
Debt
Telangana government

More Telugu News