Kolusu Parthasarathy: ఏపీ కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

Kolusu Parthasarathy Explains AP Cabinet Decisions
  • అమరావతిలో మరోసారి భూసమీకరణకు కేబినెట్ నిర్ణయం
  • గతంలో పునాదులు పడ్డ భవనాల నిర్మాణం పూర్తికి తొలి ప్రాధాన్యం
  • మరో 9 అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు, 4687 మినీ అంగన్వాడీల అప్‌గ్రేడ్‌కు ఆమోదం
  • కాగ్నిజెంట్ సంస్థ ఏర్పాటుకు విశాఖలో భూమి, రూ.1582 కోట్ల పెట్టుబడులకు ఓకే
  • టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ సాయికి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం
  • పొగాకు కొనుగోలుకు రూ.273 కోట్లు, వచ్చే ఏడాది క్రాప్ హాలిడే
ఏపీ రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం మరోసారి భూసమీకరణ చేపట్టాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ఒకే రకమైన నిబంధనలతో ఈ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. మంగళవారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను ఆయన మీడియాకు వివరించారు.

అమరావతి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

అమరావతిలో చేపట్టబోయే భూసమీకరణ విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిబంధనలను సవరించినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ), సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జలవనరుల పరిరక్షణకు కట్టుబడి ఉంటామన్నారు. అసైన్డ్‌, దేవాదాయ, లంక భూముల విషయంలో జాయింట్ కలెక్టర్ (జేసీ) ఆధ్వర్యంలో సమగ్ర దర్యాప్తు చేయించి, సర్వే సమయంలో సరిహద్దుల వద్ద ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. స్థానిక రైతులకు ఉచిత విద్య, వైద్య సదుపాయాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.

గత ప్రభుత్వ హయాంలో పునాదులు వేసి, ఆగిపోయిన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయడంపై కేబినెట్ దృష్టి సారించిందని మంత్రి వెల్లడించారు. ఇప్పటికే టెండర్లు దక్కించుకున్న జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ (జీఏడీ), హెచ్‌వోడీ టవర్ల నిర్మాణ బాధ్యతలను ఎన్‌సీసీ, ఎల్ అండ్ టీ, షాపూర్ పల్లోంజీ సంస్థలకు అప్పగించనున్నట్లు తెలిపారు. సీఆర్‌డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసిందన్నారు. రాజధాని అమరావతిలో అన్ని హంగులతో కూడిన ఒక కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి కూడా మంత్రివర్గం సూత్రప్రాయంగా అంగీకరించింది. అమరావతిలోని ఈ3 రోడ్డును జాతీయ రహదారి 16కు అనుసంధానించేందుకు అవసరమైన రూ.682 కోట్ల విలువైన టెండర్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది.

పలు కీలక నిర్ణయాలు, కేటాయింపులు

మంత్రివర్గ సమావేశంలో మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు పార్థసారథి వివరించారు. రాష్ట్రంలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలిపిందని, పురపాలక శాఖలో 40 బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ల పోస్టుల అప్‌గ్రేడేషన్‌కు పచ్చజెండా ఊపిందని చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా మరో 9 అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు కూడా ఆమోదం లభించింది. భవన నిర్మాణ చట్టంలోని నిబంధనలను సరళీకరించి, సులువుగా అనుమతులు లభించేలా కొన్ని సవరణలు చేశారు.

టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ సాయికి క్రీడా కోటా కింద డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. తిరుపతి జిల్లా వడమాలపేటలో 12.07 ఎకరాల భూమిని పర్యాటక శాఖకు బదిలీ చేసేందుకు అనుమతించారు. ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోట వద్ద రిసార్టుల నిర్మాణం కోసం 50 ఎకరాల భూమిని కేటాయించారు. శ్రీశైలం డ్యామ్, సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీల భద్రతా పనుల కోసం రూ.350 కోట్ల నిధుల విడుదలకు ఆమోదం తెలిపారు. ఇరు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరేలా పోలవరం - బనకచర్ల ప్రాజెక్టును చేపట్టాలని కూడా నిర్ణయించారు.

విజయవాడలోని అంబేద్కర్ విగ్రహ ప్రాంగణ నిర్వహణ బాధ్యతలను సాంఘిక సంక్షేమ శాఖ నుంచి ఏపీ సాంస్కృతిక విభాగానికి బదిలీ చేయాలని, పెండింగ్‌లో ఉన్న పనులను సాంస్కృతిక విభాగం ద్వారా నిధులు కేటాయించి పూర్తి చేయాలని ఆదేశించారు. ఇటీవల జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశంలో పెట్టుబడులపై తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా, విశాఖపట్నం మధురవాడలో 22.19 ఎకరాల్లో కాగ్నిజెంట్ టెక్నాలజీ సంస్థ ఏర్పాటుకు, తద్వారా రూ.1,582 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది.

రాష్ట్రవ్యాప్తంగా 4,687 మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్‌ చేసేందుకు మంత్రివర్గం అంగీకరించింది. ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు చేసేందుకు రూ.273.17 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలనా అనుమతులు ఇచ్చారు. రాష్ట్రంలో 20 మిలియన్ టన్నుల పొగాకును ప్రభుత్వమే సేకరించాలని, వచ్చే ఏడాది పొగాకు సాగుకు క్రాప్ హాలిడే ప్రకటించాలని కేబినెట్ నిర్ణయించినట్లు మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు.
Kolusu Parthasarathy
AP Cabinet
Andhra Pradesh
Amaravati
Land Pooling
Polavaram Project
Cognizant Technology
AP Markfed
Saketh Sai
Building Inspectors

More Telugu News