Chandrababu Naidu: అమరావతి నిర్మాణానికి బంగారు గాజులు విరాళం ఇచ్చిన మహిళ

Chandrababu Naidu Receives Gold Bangles Donation for Amaravati Construction
  • రాజధాని నిర్మాణాలకు విరాళాలు అందజేత
  • 36 గ్రాముల బంగారు గాజులు, రూ.1 లక్ష నగదును సీఎంకు అందజేసిన నన్నపనేని ఉదయలక్ష్మీ
  • రూ.50 వేలు విరాళం ఇచ్చిన వెలగపూడి చంద్రావతి
రాజధాని అమరావతి నిర్మాణానికి ఇద్దరు మహిళలు విరాళం అందజేసి తమ ఔదార్యాన్ని ప్రదర్శించారు. రాష్ట్ర రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావాలనే సదుద్దేశంతో తమవంతు సహాయం అందించారు. సచివాలయంలో నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసిన తెనాలి, విజయవాడకు చెందిన ఇద్దరు మహిళలు చేతి గాజులు, నగదును విరాళంగా అందజేశారు.

తెనాలికి చెందిన నన్నపనేని ఉదయలక్ష్మి 36 గ్రాముల 546 మిల్లీగ్రాముల బంగారు గాజులను ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. నాలుగు బంగారు గాజులతో పాటు రూ.1 లక్ష చెక్కును విరాళంగా ఇచ్చారు. రాజధాని నిర్మాణం కోసం ఈ మొత్తాన్ని వినియోగించాలని కోరారు. అదేవిధంగా విజయవాడకు చెందిన వెలగపూడి చంద్రావతి రూ.50 వేలు విరాళం అందజేశారు.

ఈ సందర్భంగా వృద్ధులైన ఆ ఇద్దరు మహిళలు రాష్ట్రానికి మంచి రాజధాని ఉండాలని ఆకాంక్షిస్తూ విరాళం ఇవ్వడం గొప్ప విషయమని ముఖ్యమంత్రి వారిని అభినందించారు. వారి ఔదార్యం, ఉదారత ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

గత వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకురావడం, ఆ వివాదం న్యాయస్థానాలకు చేరడంతో రాజధాని లేని రాష్ట్రంగా విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతియేనని స్పష్టం చేస్తూ రాజధాని నిర్మాణాలపై దృష్టి సారించింది.

కేంద్ర ప్రభుత్వం సహకారం, ప్రపంచ బ్యాంకు నిధులతో అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా రాజధాని నిర్మాణ పనుల పునఃప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించింది. దీంతో రాజధాని నిర్మాణానికి తమవంతు సహాయం చేస్తామంటూ దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందజేస్తున్నారు. 
Chandrababu Naidu
Amaravati
Andhra Pradesh
Capital Construction
Donation
Women Donors
Nannapaneni Udayalakshmi
Velagapudi Chandravati
AP Capital
Golden Bangles

More Telugu News