Dalits: దళితులపై దారుణం.. గుండు కొట్టించి, గడ్డి తినిపించి మురుగునీరు తాగించారు!

Dalits Tortured in Odisha Forced to Eat Grass Drink Sewage
  • ఒడిశాలోని గంజాం జిల్లాలో వెలుగుచూసిన ఘటన
  • పశువుల అక్రమ రవాణా నెపంతో ఇద్దరిపై దాడి
  • పెళ్లికి కట్నంగా ఇచ్చేందుకు ఆవులను తీసుకెళ్తుండగా ఘటన 
  • 8 మంది అరెస్ట్.. పరారీలో ప్రధాన నిందితుడు
  • రాష్ట్రంలో శాంతిభద్రతలపై రాహుల్‌గాంధీ ఫైర్
గోవులను అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపిస్తూ ఇద్దరు దళితులపై ఓ గుంపు అత్యంత అమానుషంగా దాడి చేసి, చిత్రహింసలకు గురిచేసింది. ఒడిశాలోని గంజాం జిల్లాలో సోమవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

పోలీసుల కథనం ప్రకారం.. సింగిపూర్‌కు చెందిన బాబులా నాయక్ (54), బులు నాయక్ (42) కలిసి రెండు ఆవులు, ఒక దూడను కొనుగోలు చేసి ఆటోలో తమ ఊరుకు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో  ఖరీగుమా గ్రామం వద్దకు రాగానే, గో రక్షకులుగా చెప్పుకుంటున్న కొందరు వారిని అడ్డగించారు. ఆవులను అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపిస్తూ రూ. 30 వేలు డిమాండ్ చేశారు. ఇచ్చేందుకు వారు నిరాకరించారు. కుటుంబంలో జరగబోయే వివాహానికి కట్నంగా ఇచ్చేందుకు తీసుకెళ్తున్నట్టు చెప్పినా వినిపించుకోకుండా వారిపై దాడి చేశారు. వారి దుస్తులు విప్పించి తీవ్రంగా కొట్టారు. అనంతరం శిరోముండనం చేయించారు. ఆపై తాడుతో వారిని కట్టి ఖరీగుమా గ్రామం నుంచి జహదా వరకు రెండు కిలోమీటర్ల దూరాన్ని మోకాళ్లపై నడిపించారు. అక్కడ వారితో గడ్డి తినిపించి, మురుగునీరు తాగించారు. 

వారి చెర నుంచి ఎలాగోలా తప్పించుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.  

ఈ దారుణ ఘటనపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ఒడిశాలో జరిగిన ఈ ఘటన కులవివక్ష ఇంకా పోలేదనడానికి నిదర్శనమని ఎక్స్ వేదికగా దుమ్మెత్తి పోశారు. "బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు సర్వసాధారణంగా మారుతున్నాయి, ఎందుకంటే వారి రాజకీయాలు ద్వేషం, వివక్షపై ఆధారపడి ఉన్నాయి" అని ఆయన విమర్శించారు.
Dalits
Ganjam district
Odisha
atrocities against Dalits
caste discrimination
Rahul Gandhi
Singipur
Khariaguma village
cow smuggling

More Telugu News