Jagadish Reddy: చంద్రబాబుతో చర్చలు జరపాలనుకోవడం అవివేకం: జగదీశ్ రెడ్డి

Jagadish Reddy Calls Talks With Chandrababu Unwise on Water Issues
  • చంద్రబాబు గోదావరి నీళ్లు తరలించి తెలంగాణను ఎడారి చేస్తున్నారన్న జగదీశ్‌రెడ్డి
  • గోదావరి, బనకచర్లపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శ
  • చంద్రబాబుతో చర్చలు రాష్ట్రానికి నష్టదాయకమన్న మాజీ మంత్రి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గోదావరి జలాలను తరలించి తెలంగాణను ఎడారిగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. గోదావరి, బనకచర్ల ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం సీరియస్‌నెస్ లేదని విమర్శించారు. ఈ అంశంపై కేబినెట్‌లో కూడా సరైన చర్చ జరగలేదని ఆయన అన్నారు.

కృష్ణా జలాల విషయంలో ఇప్పటికే తెలంగాణకు అన్యాయం జరిగిందని, ఇప్పుడు గోదావరి విషయంలోనూ అదే పునరావృతం చేయాలని చూస్తున్నారని జగదీశ్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి జలాలు తెలంగాణకు జీవనాధారమని, ఈ విషయంలో అన్ని పార్టీలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబుతో చర్చలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం అవివేకమని, దీనివల్ల రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు. తక్షణమే అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేయాలని సూచించారు.

గోదావరి ట్రిబ్యునల్ తీర్పు రాకముందే 200 టీఎంసీల నీటికి హక్కు సాధించుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, రూ.80 వేల కోట్లతో నీటిని తరలించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారని ఆరోపించారు. గోదావరి-కావేరి అనుసంధానం ఒక పెద్ద మోసమని, దీనిపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఇప్పటికే అభ్యంతరాలు తెలిపిందని గుర్తుచేశారు. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోతే ప్రజలను సమీకరించి ఉద్యమిస్తామని జగదీశ్‌రెడ్డి హెచ్చరించారు. రైతు సంబరాలు చేసుకోవడానికి ప్రభుత్వానికి సిగ్గనిపించడం లేదా అని ప్రశ్నించారు.
Jagadish Reddy
Chandrababu Naidu
Godavari River
Telangana
Andhra Pradesh
Krishna River
Water Dispute
Interstate Water Conflicts
Apex Council Meeting
Godavari-Cauvery Link

More Telugu News