Indra Kumar Tiwari: పెళ్లి కావడం లేదంటూ ఆధ్యాత్మిక వేదికపై ఆవేదన.. ఆ తర్వాత అదృశ్యం.. వీడని మిస్టరీ!

Missing Man Indra Kumar Tiwari Last Seen After Seeking Marriage Help
  • మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాలో ఘటన
  • వీడియో వైరల్ అయిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్
  • పెళ్లి చేస్తాం నగలు, డబ్బు తీసుకురావాలని కోరిన వైనం
  • నాలుగు రోజుల్లో తిరిగి వస్తానని చెప్పి అదృశ్యమైన టీచర్
పెళ్లి కావడం లేదంటూ ఓ ఆధ్యాత్మిక వేదికపై ఆవేదన వెళ్లగక్కిన వ్యక్తి ఆ తర్వాత కొద్ది రోజులకే అనుమానాస్పద స్థితిలో అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాలో జరిగిందీ ఘటన. పద్వార్ (ఖిటోలా) గ్రామానికి చెందిన 45 ఏళ్ల ఇంద్రకుమార్ తివారీ గత 25 రోజులుగా కనిపించకుండా పోయాడు. పోలీసులు ఆయన కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. పార్ట్‌టైమ్ టీచర్‌, రైతు అయిన ఇంద్రకుమార్ తివారీకి 45 ఏళ్లు వచ్చినా వివాహం కాలేదు. మే నెలలో సిహోరా సమీపంలోని రివాంఝా గ్రామంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు అనిరుద్ధాచార్య మహారాజ్ నిర్వహించిన ప్రవచన కార్యక్రమంలో ఇంద్రకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడి వేదికనెక్కి తనకు పెళ్లి కావడం లేదని గురువు ముందు తన ఆవేదన వెళ్లగక్కారు. దీనిని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. 

వీడియో వైరల్ అయినా కొన్ని రోజులకే గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఇంద్రకుమార్‌కు ఫోన్ వచ్చింది. ‘ఖుషీ’ అనే అమ్మాయితో పెళ్లి జరిపిస్తామని నమ్మబలికిన ఆ ముఠా.. ఇంద్రకుమార్‌ను ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు రమ్మని చెప్పింది. పెళ్లి తంతులో భాగంగా నగలు, కొంత నగదు తీసుకురావాలని కూడా సూచించినట్టు తెలిసింది.

వారి మాటలు నమ్మిన ఇంద్రకుమార్ ఈ నెల 2న సాయంత్రం ఇంటి నుంచి బయలుదేరారు. 6వ తేదీ కల్లా తిరిగి వస్తానని చుట్టుపక్కల వారికి చెప్పి వెళ్లారు. అప్పటి నుంచి ఆయన ఆచూకీ తెలియరాలేదు, ఎవరితోనూ సంప్రదింపులు జరపలేదు. దీంతో ఆందోళనకు గురైన స్థానికులు 8న మజౌలీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఇంద్రకుమార్‌కు సమీప బంధువులు ఎవరూ లేకపోవడం, ఒంటరిగా జీవిస్తుండటంతో ఆచూకీ కనుగొనడం పోలీసులకు సవాలుగా మారింది. అయినప్పటికీ, పోలీసులకు విచారణలో గ్రామస్థులు సహకరిస్తున్నారు. దాదాపు నెల రోజులు కావస్తున్నా ఇంద్రకుమార్ జాడ తెలియకపోవడంతో ఆందోళన మరింత పెరిగింది. దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. 
Indra Kumar Tiwari
missing person
spiritual guru
Aniruddhacharya Maharaj
marriage proposal
Uttar Pradesh
fraud
Khushi
Jabalpur
Madhya Pradesh

More Telugu News